Putin Modi Phone Call: ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ఫోన్లో సంభాషణలు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సమస్యలు, ఇండో- పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితిపై చర్చించారు. పుతిన్ భారత్ పర్యటన పూర్తయి రెండు వారాలు దాటిన తర్వాత ఇరు దేశాధినేతలు ఫోన్లో సంభాషించుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
" నా స్నేహితుడు పుతిన్‌తో మాట్లాడాను. ఇటీవల పుతిన్‌ను కలిసినప్పుడు తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించాం. భారత్- రష్యా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా నిర్ణయం తీసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల అభివృద్ధి చెందిన అంశాలపైనా చర్చించాం."
-- ప్రధాని నరేంద్ర మోదీ
ఇదే సంభాషణపై పుతిన్ కూడా మోదీకి కృతజ్ఞతలు తెలిపినట్లు రష్యా ప్రభుత్వవర్గాలు తెలిపాయి. డిసెంబరు 6న రష్యాకు చెందిన ప్రతినిధులు భారత్‌లో పర్యటించినప్పుడు కేంద్రం ఇచ్చిన ఆతిథ్యంపై పుతిన్ కృతజ్ఞతలు తెలిపినట్లు వివరించాయి.
సెంట్రల్ ఆసియా దేశాలతో మోదీ భేటీ..
Central Asia Ministers Modi: సెంట్రల్ ఆసియా దేశాల విదేశాంగ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సెంట్రల్ ఆసియా దేశాలైన కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, తుర్కెమినిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఆయా దేశాలతో భారత్‌కు ఉన్న ప్రాముఖ్యతను ప్రస్తావించారు. అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రధాని మోదీతోపాటు విదేశాంగమంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ పాల్గొన్నారు.
సెంట్రల్ ఆసియా విదేశాంగ మంత్రులతో మోదీ ఐదు సెంట్రల్ ఆసియా దేశాలతో భారత్‌కు ఉన్న సాంస్కృతిక, వ్యాపార ఒప్పందాలను బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపారు. ఈ సమావేశం తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
సెంట్రల్ ఆసియా విదేశాంగ మంత్రులతో మోదీ సమావేశం " సెంట్రల్ ఆసియాలోని ఐదు దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యాను. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపాం." అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి:జపాన్ కుబేరుడి స్పేస్ టూర్ సక్సెస్.. సేఫ్‌గా భూమికి..