ప్రభుత్వ కొలువు సంపాదించేందుకు చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. రాత్రి, పగలు తేడా లేకుండా శ్రమించి చదువుతుంటారు. చదివినవన్నీ పరీక్షాపత్రంపై రాసి ఉద్యోగం కొట్టేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటారు. అయితే ఇదంతా.. సాధారణ వ్యక్తులకు! కానీ దివ్యాంగులకు మాత్రం అలా కాదు. వాళ్లు ఎంత కష్టపడి చదివినా మరొకరిపై ఆధారపడాల్సి ఉంటుంది. స్క్రైబ్ సహాయంతోనే పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది. అలాంటి వారి కోసం కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన పుష్ప అనే మహిళ.. ఇప్పటి వరకు స్క్రైబ్‌గా 1000కు పైగా పరీక్షలు రాశారు. 16 సంవత్సరాలుగా దివ్యాంగులకు ఉచితంగా పరీక్షలు రాస్తూనే ఉన్నారు. ఆమె గురించి ఓసారి తెలుసుకుందాం.
Pushpa Scribe : దొడ్డబళ్లాపురకు చెందిన పుష్ప ప్రియ.. కొన్నాళ్ల క్రితం కొన్ని కారణాల వల్ల కుటుంబంతో బెంగళూరు వచ్చేశారు. పుష్ప తండ్రి కాంట్రాక్ట్ వర్కర్‌గా బెంగళూరులో పనిచేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తీవ్ర అనారోగ్యానికి గురై పనిచేయలేని స్థితికి చేరుకున్నారు. దీంతో వారి కుటుంబానికి ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి.
పుష్పతో పాటు ఆమె సోదరుడిని చదివించేందుకు వారి తల్లి.. స్థానికంగా ఉన్న ఇళ్లల్లో పనిచేసింది. అలా వారిద్దరికీ ఉన్నతమైన విద్య అందించింది. అయితే 2007లో ఒకరోజు బయటకు వెళ్లేందుకు పుష్ప ఓ బస్సు ఎక్కారు. ఆ ప్రయాణంలో అంధుడైన ఓ వ్యక్తిని ఆమె కలుసుకున్నారు. ఇద్దరూ పలు విషయాలపై కాసేపు మాట్లాడారు. ఆ సమయంలో అతడు.. పుష్పను ఓ కోరిక కోరాడు. తాను హాజరవ్వబోయే పరీక్షకు స్క్రైబ్‌గా ఉండాలని అడిగాడు. అందుకు పుష్ప అంగీకరించి పరీక్ష రాశారు.
అలా అప్పటి నుంచి 2021 వరకు.. ఏ ఉద్యోగం చేయకుండా కేవలం దివ్యాంగులకు స్క్రైబ్‌గా పరీక్షలు రాస్తూనే గడిపారు పుష్ప. కానీ ఆ తర్వాత బెంగళూరులో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అయినా ఇప్పటికీ స్క్రైబ్‌గా పరీక్షలు రాస్తూనే ఉన్నారు. తన యజమాని చాలా మంచి వ్యక్తిని.. స్క్రైబ్‌గా పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు సెలవులు ఇస్తున్నారని చెప్పారు. తాను మొదటిసారి స్క్రైబ్‌గా పరీక్ష రాసినప్పుడు.. చాలా భయపడ్డానని అన్నారు పుష్ప. ఏదైనా తప్పు రాస్తే.. అభ్యర్థి మార్కులు కోల్పోతారనే భయంతో పరీక్ష రాశానని తెలిపారు. తాను ఎవరికీ ఆర్థికంగా సహాయం చేయలేనని.. అందుకే స్క్రైబ్‌గా పరీక్షలు రాయడమే పెద్ద సహాయంగా భావిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా నారీశక్తి పురస్కారం..
సామాజిక కార్యకర్త పుష్పకు కేంద్ర ప్రభుత్వం.. 2018లో నారీశక్తి పురస్కారం ప్రకటించింది. ఆ తర్వాత 2019 మార్చి 8న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పుష్ప.. నారీ శక్తి పురస్కారం అందుకున్నారు. కొన్ని నెలల క్రితం.. పుష్ప కర్ణాటక బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు.