ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారంలో స్వామి సంపద ఎంత ఉంది? అందులోని మూడో గదిని తెరవరెందుకు? అనే విషయాలపై రాష్ట్రంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ భాండాగారానికి చెందిన మూడో గది నుంచి సొరంగ మార్గం ఉందన్న సమాచారమూ వినిపిస్తోంది. ఈ గదిలో అపార సంపద (వజ్ర, వైడూర్య, గోమేధిక, పుష్పరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణ కిరీటాలు) ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.
పూరీ క్షేత్రంలో వెలకట్టలేని సంపద, కాపలాగా సర్పాలు, గది నుంచి సొరంగ మార్గం - పూరీ ఆలయం బంగారం
పూరీలోని జగన్నాథుని రత్నభాండాగారంపై ఆ రాష్ట్రంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. భాండాగారంలోని రహస్య గదికి సొరంగ మార్గం ఉందంటూ వస్తున్న వార్తలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. వెలకట్టలేని సంపద రహస్య గదిలో ఉందని చరిత్ర చెబుతోంది.
వెలకట్టలేకపోయిన నిపుణులు:
1926 నాటి బ్రిటిష్ పాలకులు రత్న భాండాగారం తెరిపించారు. అప్పట్లో చెన్నైకి చెందిన నిపుణులు ఆభరణాలను లెక్కించారు. 597 రకాల ఆభరణాలు ఉన్నాయని, వాటి వివరాలను పేర్కొన్నారు. సంపద వెలకట్టలేమని, రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు ఉన్నట్లు శ్రీక్షేత్ర ఆస్తుల పట్టికలో లిఖించినట్లు ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ సురేంద్ర మిశ్ర ఇటీవల పూరీలో విలేకరులకు తెలిపారు. రహస్యగది దిగువన సొరంగమార్గం ఉందని, దాని కింద మరిన్ని గదులున్నాయని అప్పట్లో చెన్నె నిపుణులు తెలిపినట్లు వివరించారు.
తాము భూగర్భంలో ఉన్న ఆ గదులకు వెళ్లలేకపోయామని, లోపల సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించినట్లు ఆస్తుల గురించి రాసిన పట్టికలో ఒకచోట వారు పేర్కొన్నట్లు మిశ్ర తెలిపారు. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉత్కళ(ఒడిశా)ను పాలించిన 46 మంది రాజులు పురుషోత్తముడి భక్తులని, వారు స్వామి కోసం వెలకట్టలేని సంపదను రహస్య గదుల్లో భద్రపరిచినట్లు చెప్పారు.