BJP captain alliance: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, సుఖ్దేవ్ సింగ్ దిండ్సా పార్టీల పొత్తు కొలిక్కి వచ్చింది. పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్(సంయుక్త్)తో కూటమిగా ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి, పంజాబ్ భాజపా ఎన్నికల ఇంఛార్జ్ గజేంద్ర సింగ్ షెఖావత్. ఎన్నికలకు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఆ పార్టీ అగ్రనాయకులతో అమరీందర్ సింగ్, సుఖ్దేవ్ సింగ్ దిండ్సా సోమవారం భేటీ అయ్యారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేయటం, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
"దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో అమరీందర్ సింగ్, సుఖ్దేవ్ సింగ్ దిండ్సా సమావేశమయ్యారు. పంజాబ్లో జరగబోయే ఎన్నికల్లో భాజపా, కెప్టెన్ పార్టీ, దిండ్సా పార్టీ ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించారు. సీట్ల పంపకాల కోసం ప్రతి పార్టీ నుంచి ఇద్దరు నేతలతో ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయనున్నాం."