తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Punjab polls 2022: పంజాబ్​లో భాజపాను సిక్కులు అక్కున చేర్చుకునేనా? - పంజాబ్​ ఎన్నికలు

Punjab polls 2022: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. పక్కనే ఉన్న పంజాబ్‌లో మాత్రం ఇంకా సవాళ్లను అధిగమించలేకపోతోంది. ఇక్కడ అధికారం అందని ద్రాక్షగానే ఉంది. ఈసారి కచ్చితంగా అధికార పీఠమెక్కాల్సిందేనన్న పట్టుదలతో ఉన్న కమల దళం ఏ వ్యూహంతో ముందుకెళ్తోంది. సాగు చట్టాలతో వచ్చిన వ్యతిరేకతను ఎలా అధిగమిస్తుంది? ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా పొత్తులు, ఎత్తులు ఎలా ఉండబోతున్నాయి?

bjp punjab
పంజాబ్​ భాజపా

By

Published : Jan 27, 2022, 5:57 PM IST

Punjab polls 2022: పంజాబ్ ఎన్నికల్లో గెలుపుపై ఆప్ తరవాత భాజపా అంతే ధీమాగా ఉంది. కానీ, ప్రస్తుతం ఆ పార్టీ స్థితిగతులు చూస్తే పెద్దగా ప్రభావం చూపే అవకాశాలైతే కనిపించటం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. పంజాబ్‌లో చెప్పుకోదగిన స్థాయిలో పుంజుకోలేదు. ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా అధిష్ఠానం.. ప్రత్యేక కసరత్తులు ప్రారంభించింది. విజయమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్‌ను వీడి వేరు కుంపటి పెట్టిన మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, శిరోమణి అకాలీ దళ్(సంయుక్త్​) నేత దిండ్సాతో పలు దఫాలు చర్చలు జరిపి సీట్ల పంపకానికి ఇటీవలే తుదిరూపు ఇచ్చారు.

భాజపా 65 సీట్లలో పోటీ చేస్తుండగా.. కెప్టెన్​ అమరిందర్​ సింగ్​ పార్టీ పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​కు 37 స్థానాలు కేటాయించారు. శిరోమణి అకాలీ దళ్​(సంయుక్త్​) పార్టీకి 15 సీట్లు ఇచ్చారు.

సాగు చట్టాల రద్దే ప్రచారాస్త్రంగా..

శిరోమణి అకాలీదళ్‌తో చాలాకాలం కలసి నడిచిన భాజపా.. ఇప్పుడు వేరైపోయింది. వారి అండలేకపోయినా తమకు ఎలాంటి నష్టం ఉండదని ఘాటుగానే బదులిస్తోంది కాషాయ పార్టీ. కానీ సాగు చట్టాలపై వచ్చిన వ్యతిరేకతతో భాజపాకు నష్టం తప్పదనే మాటే అంతటా వినిపిస్తోంది. ఆ పార్టీ మాత్రం.. ఇదే మాత్రం నష్టం చేకూర్చదన్న విశ్వాసంతో ఉంది. పైగా.. రైతుల శ్రేయస్సు కోసమే ప్రధాని మోదీ సాగుచట్టాలు రద్దు చేశారని ప్రచారం చేస్తోంది. అమిత్ షా కూడా పంజాబ్‌ ఎన్నికల వ్యూహరచనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇదేమాట చెప్పినట్లు సమాచారం. అలా సాగు చట్టాల రద్దునే ఈ సారి ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు భాజపా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. రైతుల సంక్షేమ ఎజెండాతో బరిలోకి దిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.

సిక్కులను ఆకట్టుకునే వ్యూహాలు..

ఇక్కడ మరో అంశమూ కీలకంగా చర్చించాలి. హిందుత్వ పార్టీగా ముద్ర పడిపోయిన భాజపా.. ప్రస్తుతం భాజపా సిక్కులను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకే ఈ ఎన్నికల్లో సిక్కులనే పోటీలో నిలిపే వ్యూహంతో ముందుకొచ్చింది. రైతు చట్టాలతో వచ్చిన వ్యతిరేకతనూ ఈ వ్యూహంతో అధిగమించాలని చూస్తోంది. అకాలీ దళ్‌కు చెందిన సిక్కు నేతలను తన వైపు తిప్పుకుని ప్రచారంలో దూకుడుగా వ్యవహరించేందుకు పావులు కదుపుతోంది. శిరోమణి అకాలీ దళ్‌కు చెందిన కీలక నేత మంజీందర్ సింగ్ సిర్సా ఇప్పటికే భాజపా కండువా కప్పుకున్నారు. భాజపా.. సిక్కులకు అండగా నిలబడుతుందన్న విశ్వాసం ఉండటం వల్లే పార్టీలో చేరానని ఇప్పటికే మంజీందర్ సింగ్ ప్రకటించారు.

ఇక ప్రధాని మోదీ భద్రత విషయంలో జరిగిన వ్యవహారాన్ని కూడా అనుకూలంగా మార్చుకునేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోంది. శిరోమణి అకాలీ దళ్ సిక్కుల పార్టీగా ప్రచారం చేసుకున్నా ఏ రోజూ ఆ వర్గానికి అండగా నిలవ లేదని భాజపా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ఆ పార్టీ ప్రజల నమ్మకం కోల్పోయిందని అంటోంది. హిందూ-సిక్కుల మధ్య సానుకూలత పెంచటానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది భాజపా.

ఆల్ ఇండియా సిక్‌ స్టూడెంట్స్ ఫెడరేషన్‌కు నేతృత్వం వహిస్తున్న కీలక నేత హరీందర్ సింగ్ కహ్లోన్‌ కూడా భాజపాలో చేరారు. 1980 నుంచి క్షేత్రస్థాయిలో పలు ఉద్యమాల్లో పాల్గొన్న హరీందర్ సింగ్‌కు ప్రజల్లో మంచి మద్దతు ఉంది. ఇలాంటి నాయకుడు భాజపాలో చేరటం.. వారికి కలిసొచ్చేదే.

హిందువుల విషయానికొస్తే.. పంజాబ్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం.. వీరి వాటా 38 శాతం. అంటే సిక్కులతో పాటు హిందువులనూ తమవైపు తిప్పుకుంటేనే భాజపాకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మరో అంశమూ కీలకంగా ఉంది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘాల్లో హిందువుల సంఖ్య భారీగానే ఉంది. అయితే.. ఈ చట్టాలను రద్దు చేయటం వల్ల ఈ వర్గం తమకు మద్దతుగానే నిలుస్తుందని భావిస్తోంది భాజపా. ఈ పరిణామాలతో పాటు.. అకాలీ దళ్‌కు చెందిన కీలక నేతలు భాజపా కండువా కప్పుకోవటం కలిసొస్తోంది. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మరో 8 మంది మాజీ ఎమ్మెల్యేలు భాజపాలో చేరినట్టు ఆ పార్టీ చెబుతోంది.

నయా పంజాబ్​ నినాదంతో..

పంజాబ్‌ శాసనసభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ 'నవా పంజాబ్‌, భాజపా దే నాల్‌'.. భాజపాతో నయా పంజాబ్‌ అంటూ తన ఎన్నికల నినాదాన్ని గతంలోనే ప్రకటించింది. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని అప్పుడే తెలిపింది. ఇసుక, డ్రగ్స్ మాఫియాను అంతమొందించటమే లక్ష్యమంటూ ముందుకెళ్తోంది కాషాయ పార్టీ.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details