సాధారణంగా పెళ్లిళ్లలో అనేక రకాల బ్యాండ్లను విని ఉంటాము. వాటిల్లో తీన్మార్, మర్ఫా, బజంత్రీలు, పియానో, మహారాష్ట్ర బ్యాండ్, కేరళ బ్యాండ్ అని ఇలా వివిధ రకాల వాయిద్యాలు పెళ్లి క్రతువుకు మరింత జోష్‌ను తెస్తాయి. అంతేగాక ఒక్కోసారి మిలటరీ బ్యాండ్ మేళాన్ని కూడా వింటూ ఉంటాము. కానీ పంజాబ్ పోలీస్ అధికారులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. తమ శాఖకు మాత్రమే పరిమితమైన బ్యాండ్‌ను ఇకపై అందరి వివాహ వేడుకలతో పాటు ఇతర శుభకార్యాల్లో కూడా వాయించుకునే అవకాశాన్ని కల్పించింది శ్రీ ముక్త్సార్ సాహిబ్ జిల్లా పోలీస్ శాఖ. దీంతో పంజాబ్ ప్రజలు ఇక నుంచి తమ వ్యక్తిగత కార్యక్రమాల్లో కూడా పంజాబ్ పోలీస్ బ్యాండ్‌ను చేర్చుకొని తమ వేడుకలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించుకోవచ్చు. ఇందుకోసం ముందుగానే బుకింగ్స్ చేసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా ప్రజల శుభకార్యాల్లో స్వయంగా పోలీసులే బ్యాండ్ వాయిద్యాలను వాయిస్తారని చెప్పింది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను శ్రీ ముక్త్సార్ సాహిబ్ జిల్లా ఎస్ఎస్పీ హర్మన్‌దీప్ సింగ్ గిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సర్క్యులర్‌లో ప్రజలు తమ వివాహాలతో పాటు ఇతర శుభకార్యాలకి కూడా పంజాబ్ పోలీస్ శాఖ బ్యాండ్‌ను బుక్ చేసుకోవచ్చని వివరించింది. ఈ బ్యాండ్‌ను ముందుగా ఎలా బుక్ చేసుకోవాలి..? ఎంత రుసుమును చెల్లించాలనే వివరాలను కూడా ఇందులో క్లుప్తంగా వివరించారు ఎస్ఎస్పీ. కాగా, ఈ పంజాబ్ పోలీసుల అధికారిక బ్యాండ్‌లో సినిమా పాటల ట్యూన్లను కూడా వాయిస్తారు పోలీసులు.