తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ భాజపా నేతను అరెస్ట్​ చేసిన పంజాబ్​ పోలీసులు.. హరియాణాలో టెన్షన్​!

Punjab Police Arrests Bagga: దిల్లీ కేంద్రంగా మరోసారి రాజకీయ దుమారం చెలరేగింది. అక్కడి భాజపా ప్రతినిధి తజిందర్​ పాల్​ బగ్గాను పంజాబ్​ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మొహాలీకి తరిలిస్తుండగా హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. చివరకు దిల్లీ పోలీసులు వచ్చి బగ్గాను తమ కస్టడీలోకి తీసుకుని మళ్లీ దిల్లీకే తీసుకెళ్లారు.

Punjab police arrest BJP leader Tajinderpal Singh Bagga in Delhi
దిల్లీ భాజపా నేతను అరెస్ట్​ చేసిన పంజాబ్​ పోలీసులు

By

Published : May 6, 2022, 1:18 PM IST

Updated : May 6, 2022, 4:54 PM IST

Punjab Police Arrests Bagga: దిల్లీ భాజపా ప్రతినిధి తజిందర్​ పాల్​ సింగ్​ బగ్గాను.. పంజాబ్​ పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో ఆయనపై నమోదైన కేసుకు సంబంధించి దిల్లీ జనక్​పురిలోని బగ్గా నివాసంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పంజాబ్​కు తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. బగ్గాకు గతంలో ఐదుసార్లు నోటీసులు పంపినా.. విచారణకు రాలేదని వెల్లడించారు.

నాటకీయ పరిణామాలు: బగ్గాను పంజాబ్​ పోలీసులు అరెస్టు చేసిన అనంతరం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 10-15 మంది పోలీసులు తమ ఇంటికి వచ్చి దాడి చేశారని బగ్గా తండ్రి దిల్లీ పోలీసులను ఆశ్రయించారు. తన కుమారుడికి ఎక్కడికో తీసుకెళ్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో దిల్లీ పోలీసులు.. పంజాబ్‌ పోలీసులపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. తజిందర్‌ బగ్గా అరెస్టు గురించి పంజాబ్‌ పోలీసులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని దిల్లీ పోలీసులు ఆరోపించారు.

తజిందర్‌ బగ్గాను కోర్టులో హాజరుపర్చేందుకు పంజాబ్‌ పోలీసులు మొహాలీకి తరలిస్తుండగా.. కురుక్షేత్ర వద్ద హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. వారు ఎందుకు అడ్డుకున్నారనే దానిపై సమాచారంలేదు. అయితే దిల్లీ పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే హరియాణా పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం దిల్లీ పోలీసులు బగ్గాను తమ కస్టడీలోకీ తీసుకున్నారు. మళీ దిల్లీకి తీసుకెళ్లారు.

బగ్గా కొద్దిరోజులుగా దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​పై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 'ది కశ్మీర్​ ఫైల్స్'​ చిత్రంపై కేజ్రీవాల్​ చేసిన ట్వీట్లను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం నివాసం ఎదుట నిరసన సందర్భంగా.. భాజపా యువజన విభాగంలో ఉన్న ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో పంజాబ్​, దిల్లీలోని ఆప్​ నేతలు బగ్గాపై విరుచుకుపడ్డారు. రెచ్చగొట్టే ప్రకటనలు, బెదిరింపుల అభియోగాలతో.. ఆయనపై గత నెలలో పంజాబ్​ పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజకీయ దుమారం:బగ్గా అరెస్టు వ్యవహారం నేపథ్యంలో అరవింద్​ కేజ్రీవాల్​పై మండిపడుతున్నారు భాజపా నేతలు. తన పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్​ పోలీసు బలగాలను కేజ్రీవాల్​ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. బగ్గా, ఆయన తండ్రి పట్ల.. పంజాబ్​ పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని అన్నారు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్​ చుగ్​.


ఇవీ చూడండి:ఎమ్మెల్యే జిగ్నేష్​ మేవాణికి మూడు నెలల జైలు శిక్ష

'బెయిలొస్తే సంబరాలా? అందుకే రద్దు చేస్తున్నాం.. వారంలో లొంగిపోవాలి'

Last Updated : May 6, 2022, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details