బ్యారికేడ్లను తొలగించిన పోలీసులు..
దిల్లీ వెళ్లేందుకు రైతులకు అనుమతి లభించడంతో.. హరియాణా- పంజాబ్ సరిహద్దులోని శంబూ ప్రాంతం వద్ద బారికేడ్లను తొలగించారు పోలీసులు. ఎవరినీ అడ్డుకోమని, రైతులు వెళ్లవచ్చని అంబాలా ఎస్పీ రాజేశ్ కలియా స్పష్టం చేశారు.
17:25 November 27
బ్యారికేడ్లను తొలగించిన పోలీసులు..
దిల్లీ వెళ్లేందుకు రైతులకు అనుమతి లభించడంతో.. హరియాణా- పంజాబ్ సరిహద్దులోని శంబూ ప్రాంతం వద్ద బారికేడ్లను తొలగించారు పోలీసులు. ఎవరినీ అడ్డుకోమని, రైతులు వెళ్లవచ్చని అంబాలా ఎస్పీ రాజేశ్ కలియా స్పష్టం చేశారు.
16:37 November 27
కేంద్రం సిద్ధమే..
రైతులతో చర్చకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు హరియాణా ముఖ్యమంత్రి మనోహల్లాల్ ఖట్టర్. రైతులు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా ప్రభుత్వంతోనే సంప్రదింపులు జరపాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
16:15 November 27
'రైతుల పోరాటాన్ని ఎవరూ అడ్డుకోలేరు'
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలిపారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.
సత్యం కోసం రైతులు చేస్తున్న పోరాటాన్ని ప్రపంచంలో ఏ ప్రభుత్వమూ అడ్డుకోలేదని ట్వీట్ చేశారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
15:35 November 27
దిల్లీలోకి ప్రవేశించిన రైతులు..
పోలీసుల అనుమతితో రైతులు దిల్లీలోకి ప్రవేశించారు. టిక్రీ సరిహద్దు గుండా నిరంకారీ సమగం మైదానానికి చేరుకుంటున్నారు.
14:48 November 27
స్వాగతించిన పంజాబ్ సీఎం..
రైతులను దిల్లీలోకి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. రైతులకు శాంతియుతంగా నిరసన చేసుకునే స్వేచ్ఛ ఉందని పునరుద్ఘాటించారు. కేంద్రం ఇప్పటికైనా రైతు సమస్యలపై, వ్యవసాయ చట్టాలపై వారితో మాట్లాడాలని కోరారు. సమస్యకు పరిష్కారం చూపించాలని స్పష్టం చేశారు.
14:42 November 27
దిల్లీకి అనుమతి..
దేశ రాజధానికి ర్యాలీగా బయల్దేరిన పంజాబ్, హరియాణాకు చెందిన రైతులను దిల్లీలోకి వచ్చేందుకు పోలీసులు అనుమతించారు. బురారీ ప్రాంతంలోని నిరంకారీ సమాగం మైదానంలో రైతులు నిరసన చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
అయితే.. రైతులు తమ నిరసనలను శాంతియుతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు దిల్లీ పోలీస్ కమిషనర్.
13:52 November 27
రైతులను జైళ్లకు పంపలేం..
స్టేడియాలను జైళ్లుగా వాడుకుంటామన్న దిల్లీ పోలీసుల అభ్యర్థనను కేజ్రీవాల్ ప్రభుత్వం తిరస్కరించింది. రైతులను జైళ్లకు పంపేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు దిల్లీ హోంమంత్రి సత్యేంద్రజైన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
12:49 November 27
శంబు సరిహద్దులో ఉద్రిక్తత..
అంబాలా సమీపంలోని శంబు సరిహద్దులో రైతులను చెదరగొట్టేందుకు జల ఫిరంగులు, బాష్పవాయువును ప్రయోగించారు పోలీసులు.
12:45 November 27
కాలినడకన వరుడు..
రైతుల ఆందోళన కారణంగా దిల్లీ సరిహద్దుల్లో వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఈ నేపథ్యంలో మేరఠ్‌లో వరుడు సహా ఓ పెళ్లి బృందం కాలి నడకన వెళుతూ కనిపించింది.
12:38 November 27
కేంద్రానికి సీఎం విజ్ఞప్తి..
రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరపాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కోరారు. దిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరదించాలని సూచించారు.
12:07 November 27
అంబాలాలో ఎదురెదురుగా..
శంబు సరిహద్దులో పోలీసులు భారీగా మోహరించారు. పంజాబ్ నుంచి రైతులను హరియాణాలోకి ప్రవేశించకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటర్ కెనాన్లను సిద్ధంగా ఉంచారు. ఈ నేపథ్యంలో సరిహద్దులోనే గురువారం నుంచి రైతులు ఎదురుచూస్తున్నారు.
11:56 November 27
బారికేడ్లను దాటి..
సిర్సాలో బారికేడ్లను తోసుకుని రైతులు దిల్లీ వైపు సాగుతున్నారు. ఆందోళనలను శాంతియుతంగానే నిర్వహిస్తామని, అవసరమైతే అక్కడే నెలరోజులైనా ఎదురుచూస్తామని ఓ రైతు తెలిపాడు.
11:45 November 27
భారీగా ట్రాఫిక్ జామ్..
యమునా ఎక్స్‌ప్రెస్ వేపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
11:38 November 27
ట్రాక్టర్‌తో లారీ తొలగింపు..
టిక్రీ సరిహద్దుకు భారీ సంఖ్యలో రైతులు తరలిరాగా.. దిల్లీకి వెళ్లే మార్గాన్ని లారీతో బ్లాక్ చేశారు. ఆగ్రహించిన రైతులు.. ట్రాక్టర్ సాయంతో లారీని తొలగించారు.
11:17 November 27
పోలీసులు- రైతుల మధ్య ఘర్షణ
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్-హరియాణా రైతులు చేపట్టిన 'ఛలో దిల్లీ' కార్యక్రమంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. దిల్లీ వైపు సాగుతున్న రైతులను సింఘు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
రైతులు దిల్లీలోకి వెళ్లకుండా సాయుధ పోలీసులు నిలువరించేందుకు యత్నించగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.
జైళ్లుగా మైదానాలు..!
రైతుల మార్చ్ నేపథ్యంలో నగరంలోని పది స్టేడియాలను జైళ్లుగా వాడుకునేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దిల్లీ పోలీసులు కోరినట్లు తెలుస్తోంది.