పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మార్చుతూ ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై మధ్యాహ్నం 2 గంటలకే ఇంటికి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. ఉద్యోగులు, ప్రజాసంఘాలతో చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు.. మధ్యాహ్నమే ఇంటికి వెళ్లిపోయి కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడపొచ్చని చెప్పారు. అయితే, ఉద్యోగులంతా ఉదయం 7.30 గంటలకే కార్యాలయాలకు రావాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ పనివేళలు మే 2 నుంచి జులై 15 వరకు అమలులో ఉండనున్నాయి. పనివేళలు మార్చడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఏదైనా ఉద్యోగం చేసుకునే వారు ప్రభుత్వ కార్యాలయాల్లో పని ఉంటే.. ఉదయమే పూర్తి చేసుకోవచ్చని అన్నారు. సెలవు పెట్టి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేదని చెప్పుకొచ్చారు. వేసవిలో ఎండ తీవ్రం కాకముందే.. ప్రజలు తమ పనులను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. తాను కూడా 7.30 గంటలకే ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తానని స్పష్టం చేశారు మాన్. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు సైతం ప్రయోజనం కలుగుతుందని అన్నారు. దేశంలో ఇలాంటి విధానం ప్రవేశపెట్టడం పంజాబ్‌లోనే తొలిసారని మాన్ వివరించారు. విదేశాల్లో మాత్రం ఈ విధానాన్ని అమలు చేశారని చెప్పారు.