Punjab Election Results: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భారీ విజయం సాధించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్ ప్రజల విప్లవానికి అభినందనలంటూ ట్వీట్ చేశారు.
"పంజాబ్ ప్రజల విప్లవానికి మనస్ఫూర్తిగా అభినందనలు" అని దిల్లీ సీఎం కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఆప్ సీఎం అభ్యర్థి ఎంపీ భగవంత్ మాన్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని కూడా కేజ్రీవాల్ పోస్ట్ చేశారు. అందులో ఇద్దరు నేతలు విజయ చిహ్నంతో స్టిల్ ఇచ్చారు.
పంజాబ్‌లో తమ పార్టీ గెలిపొందిన నేపథ్యంలో దిల్లీలో హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఈ సమయంలో మనీశ్ సిసొడియా, సత్యేంద్ర జైన్లు కేజ్రీవాల్ వెంట ఉన్నారు.
'ప్రమాణ స్వీకారం రాజ్‌భవన్‌లో చేయను'
తమ పార్టీ గెలిచిన తరుణంలో ప్రమాస్వీకారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్. రాజ్‌భవన్‌లో కాకుండా భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్‌కలన్‌లో పంజాబ్ సీఎంగా ప్రమాణం చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం.. పాఠశాలలు, వైద్య ఆరోగ్య, క్రీడా మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
ధురిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన మాన్.. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోలకు బదులు భగత్ సింగ్, అంబేడ్కర్ ఫొటోలు పెట్టుకోవచ్చన్నారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు అభినందనలు తెలిపారు. ఆ సందర్భంలోనే మాన్ తల్లి హర్పాల్ కౌర్ భావోద్వేగానికి గురయ్యారు. ఆ క్షణంలో కుమారుడి ఒడిలో వాలిపోయారు హర్పాల్ కౌర్.