Punjab Dalit votes: ఎన్నికల కమిషన్ (ఈసీ) ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సింది- ఫిబ్రవరి 14న. కానీ ఇప్పుడు జరగబోయేది- ఫిబ్రవరి 20న. ఈ ఒక్క పరిణామం చాలు.. పంజాబ్‌లో దళితుల ప్రాబల్యం చెప్పడానికి. ఫిబ్రవరి 16న వారణాసిలో నిర్వహించే గురు రవిదాస్ జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు దళితులు అధిక సంఖ్యలో వెళ్తుంటారని, వారు ఓటుహక్కు వినియోగించుకోవాలంటే ఎన్నికలను వాయిదా వేయాలని మూకుమ్మడిగా పార్టీలన్నీ విన్నవించడంతో ఈసీ పోలింగ్ తేదీని మార్చింది.
39 ఉప కులాలు
Punjap Election 2022: పంజాబ్ జనాభాలో దాదాపుగా మూడో వంతు ప్రజలు ఎస్సీలే. దేశంలో మరే రాష్ట్రంలోనూ వారి వాటా ఇంత ఎక్కువగా లేదు. ఇక్కడ ఎస్సీల్లోనే 39 ఉప కులాలున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఐదు. అవి- చమార్, అద్-ధర్మీ, బాల్మీకీ, మఝాబీ, రాయ్ సిఖ్. ఈ ఐదు ఉప కులాలకు చెందినవారే రాష్ట్రంలోని మొత్తం ఎస్సీ జనాభాలో 80% వరకు ఉంటారు. అద్-ధర్మీ, చమార్‌లలో మళ్లీ రవిదాసియాలు, రామ్‌దాసియాలు అనే వర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలోని దొవాబా ప్రాంతంలో దాదాపు 12 లక్షల మంది రవిదాసియాలు నివసిస్తున్నట్లు అంచనా. జలంధర్‌లోని డేరా సచ్‌ఖండ్ బల్లాన్.. రవిదాసియాలకు సంబంధించి రాష్ట్రంలో అతిపెద్ద డేరా.
అన్ని పార్టీల్లోనూ..
Dalit votes punjab:ప్రధానంగా దొవాబా ప్రాంతంలోని జలంధర్, హోశియార్‌పుర్, కపుర్తలా, నవాంశహర్ జిల్లాల్లో ఎస్సీల జనాభా ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను వారు ప్రభావితం చేయగలరని అంచనా. అయితే- వీరు గంపగుత్తగా ఒకే పార్టీకి మద్దతుగా ఉంటున్న దాఖలాలేవీ లేవు. ఉపకులాలు, ప్రాంతాలవారీగా.. కొన్నిచోట్ల మతపరమైన భావాల ప్రాతిపదికన కూడా వారు విడిపోయి కనిపిస్తున్నారు. వేర్వేరు పార్టీలకు అండగా నిలుస్తున్నారు. దీంతో- అన్ని పార్టీలూ ఎస్సీలను తమవైపునకు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారిపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.