పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్లీనంగా రగులుతూ వస్తున్న లుకలుకలు చివరకు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్(Amarinder singh news) పదవికి ఎసరు పెట్టాయి. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ నుంచి, ఇంతకు ముందు పర్గత్‌సింగ్, ప్రతాప్‌సింగ్ భజ్వా వంటి ఇతర నేతల నుంచి అమరీందర్ (Amarinder singh news Punjabi) అసంతృప్తిని ఎదుర్కొంటూనే వస్తున్నారు. సామాన్యులకు కాదు కదా కనీసం తమకైనా సీఎం అందుబాటులోకి లేకపోవడంతో ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయన వైఖరిపై పార్టీ అధిష్ఠానానికి(Punjab politics news) ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ నాలుగున్నరేళ్లలో అమలు కాలేదని, దానివల్ల పార్టీ చెడ్డపేరు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. మరోవైపు.. ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకొని సిద్ధూ మాట్లాడటం మొదలుపెట్టారు. అసంతృప్తులు ఆయనవైపు చేరి సీఎంపై బాణాలు ఎక్కుపెట్టారు. సగానికి పైగా ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉండటం, పార్టీ హైకమాండ్ ఒత్తిడి చేయడంతో ఆయనకు విధిలేని పరిస్థితులు ఎదురయ్యాయి. బలాన్ని తెలుసుకోవడానికి తన ఫామ్‌హౌస్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పంపిస్తే 13 మంది ఎమ్మెల్యేలే వచ్చారు. దాంతో ఆయనకు సీఎల్‌పీలో ఎదురయ్యే పరిస్థితి ఏంటో అర్థమైంది. అందుకే రాజీనామా చేశారని తెలుస్తోంది.
సోనియా చెప్పినా కూడా..!
సిద్ధూ నాయకత్వాన్ని అమరీందర్ ఎంతగా వ్యతిరేకించినప్పటికీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(sonia gandhi news update) నచ్చజెప్పారు. అందరినీ కలుపుకొని వెళ్లాలని సూచించారు. తర్వాత కూడా ఆయన తీరు మారలేదన్న వాదన ఉంది. అందుకే ఆయన రాజీనామా కోసం రాహుల్‌గాంధీ(rahul gandhi latest news) ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో అస్థిరత్వం పెరిగిపోతోందన్న భావన అధినాయకత్వానికి రావడంతో అంతిమంగా కెప్టెన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా జాట్ సామాజిక వర్గానికి చెందిన సిద్ధూ ఉన్నందున వచ్చే ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా హిందువును, ఉప ముఖ్యమంత్రిగా దళితులను చేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2017 ఎన్నికల సమయంలోనే అదే తన చివరి ఎన్నిక అని, తనకే ఓటేయమని అడిగి అమరీందర్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తనకు దక్కని పదవిని ఎవ్వరికీ దక్కనివ్వకూడదన్న ఉద్దేశంతో ఆయన వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.