Punjab congress: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరులో కాంగ్రెస్‌కు విజయావకాశాలు మెరుగ్గా కనిపిస్తున్న పంజాబ్‌లో ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిపై నెలకొన్న అస్పష్టత ఆదివారం తొలగిపోనుంది. తమ సీఎం అభ్యర్థిని మధ్యాహ్నం 2 గంటలకు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. బహుశా...సీనియర్ నేత రాహుల్ గాంధీయే లూథియానాలో నిర్వహించే ఒక ర్యాలీ సందర్భంగా ఆ ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే, పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు ఇంతటితో ఆగిపోతాయా? రాష్ట్ర పార్టీ నాయకత్వం మొత్తం ఏకతాటిపై నిలిచి ఎన్నికల్లో పోరాడుతుందా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్ సింగ్ సిద్ధూ చేస్తున్న పరోక్ష వ్యాఖ్యలు, వేస్తున్న చురకలు ఈ సందేహాన్నే రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్‌కే చెందిన సీనియర్ నేత సునీల్ జాఖడ్ కూడా సీఎం రేసులో ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
చన్నీ వైపే అధిష్ఠానం చూపు..
ఈనెల 20వ తేదీన జరిగే పంజాబ్ ఎన్నికలకు తమ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం చరణ్‌జిత్‌సింగ్ చన్నీనే కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కోసం ఆ పార్టీ నిర్వహించిన సర్వేలో ఆయనకే అత్యధిక మొగ్గు కనిపించినట్లు పార్టీ వర్గాల సమాచారం. పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్ సిద్ధూ చాలా వెనుకబడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ సీఎం అభ్యర్థుల పేర్లను వెల్లడించి ఎన్నికల్లో పోరాడుతుండగా, కాంగ్రెస్‌లో మాత్రం అయోమయం కొనసాగుతూ వచ్చింది. చన్నీ దళిత సామాజిక వర్గానికి చెందినవారు కావడం, అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సౌమ్యంగా వ్యవహరిస్తూ తన పని తాను చేసుకుపోవడం కాంగ్రెస్ పార్టీలో ఆయనకు సానుకూలతను పెంచినట్లు కార్యకర్తలు చెబుతున్నారు.
ఇద్దరి పేర్లనూ ప్రకటిస్తారా..!
సిద్ధూ పరోక్ష హెచ్చరికల నేపథ్యంలో పార్టీ అంతర్గత కుమ్ములాటలు బహిర్గతం కాకుండా నివారించేందుకు అధిష్ఠానం ఇద్దరి పేర్లను ప్రకటించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకరు సీఎం అభ్యర్థిగా, మరొకరు ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇద్దరు నేతల పేర్లను ప్రకటిస్తే ఘర్షణ వాతావరణాన్ని తాత్కాలికంగానైనా వాయిదా వేయవచ్చని అంటున్నారు. రొటేషన్ పద్దతిలో సీఎంలను మార్చే అంశాన్ని ప్రస్తుతానికి వెల్లడించకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
సిద్ధూ వాగ్బాణాల అర్థమేమిటో!
కాంగ్రెస్ అధిష్ఠానం పంజాబ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోవడం వల్ల సిద్ధూ కూడా దానిపై ఆశలు పెంచుకుంటూ వచ్చారు. అందుకే త్వరగా అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏ అభ్యర్థి అయినా శక్తిని చాటుకోలేని గుర్రంలా ఉండాలనుకోరని తనదైన శైలిలో చమత్కరించారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ను కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదని, ఇంకెవ్వరికీ అది సాధ్యం కాదని కూడా హెచ్చరించడం ద్వారా సీఎం అభ్యర్థి ప్రకటన తర్వాత కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందన్న సంకేతాన్నిచ్చారు. పైన కూర్చున్న వారు బలహీనమైన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని, కానీ బలమైన ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం పంజాబ్ ప్రజల చేతుల్లో ఉందని కూడా వ్యాఖ్యానించారు. తాజాగా.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేదానిపైనే 60 మంది పోటీదారుల భవిత ఆధారపడి ఉంటుందని సిద్ధూ అమృత్‌సర్‌లో వ్యాఖ్యానించారు. ఏ పార్టీ పేరును ప్రస్తావించకుండానే ఈ వ్యాఖ్య చేశారు. ముఖ్యమంత్రి చన్నీ మేనల్లుడిని ఈడీ అరెస్టు చేసిన సందర్భాన్నీ సిద్ధూ తనకు అవకాశంగా మార్చుకొనే యత్నం చేస్తున్నారు. సీఎం అభ్యర్థిగా సిద్ధూను ప్రకటించకపోతే టీవీ షో ప్రయోక్త వృత్తికి తిరిగి వెళ్తారని ఆయన భార్య నవ్‌జోత్ కౌర్ పేర్కొనడం గమనార్హం.
ఇదీ చూడండి:సవాళ్లు.. సెటైర్లు.. హీటెక్కిన పంజాబ్ అసెంబ్లీ రణం
Amritsar East: సిద్ధూ పంజా విసురుతారా? మజీఠియా షాక్ ఇస్తారా?