పంజాబ్ రాజకీయాలు (Punjab congress news) సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి (పీసీసీ) నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Sidhu news) రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ పంపారు.
పంజాబ్ భవిష్యత్, సంక్షేమ అజెండా విషయంలో రాజీ పడడం ఇష్టంలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అందులో పేర్కొన్నారు. రాజీపడితే వ్యక్తిత్వం కోల్పోయినట్లేనని లేఖలో తెలిపిన సిద్ధూ.. పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు.
ఈ ఏడాది జులైలో పంజాబ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన సిద్ధూ.. రెండు నెలల్లోనే పదవికి దూరమయ్యారు.
సిద్దూ బాటలో మంత్రి..
సిద్ధూ రాజీనామాకు మద్దతుగా రెండు రోజుల క్రితం పంజాబ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రజియా సుల్తానా కూడా పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. సిద్ధూ సిద్ధాంతాలను పాటించే వ్యక్తి అని, పంజాబ్ ప్రజల శ్రేయస్సు కోసమే ఆయన పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఆయనతో పాటే నడుస్తానన్నారు.
అమరీందర్ తప్పుకున్న కొద్దిరోజులకే..
ఇటీవల సిద్ధూతో అభిప్రాయభేదాలు, విభేదాలు నడుమ.. ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ (Amarinder singh news) రాజీనామా చేశారు. కొద్దిరోజులకే చరణ్ సింగ్ చన్నీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తర్వాత.. సిద్ధూను (Sidhu news) లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేసిన అమరీందర్.. ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంను కానివ్వనని, ఎన్నికల్లోనూ ఓడిస్తాననని ప్రతినబూనారు. సిద్ధూ.. దేశానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
భాజపాలోకి అమరీందర్!
మరోవైపు.. అమరీందర్ సింగ్ భాజపాలోకి చేరబోతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. మంగళవారం సాయంత్రం ఆయన కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవి నుంచి సిద్ధూ (Sidhu news) తప్పుకున్నారు.
సిద్ధూ తప్పుకున్న వెంటనే.. అమరీందర్ ట్వీట్ చేయడం గమనార్హం. సిద్దూకు స్థిరత్వం లేదని తాను ముందే చెప్పినట్లు, పంజాబ్ లాంటి సరిహద్దు రాష్ట్రానికి ఆయన తగరని పేర్కొన్నారు.
సిద్ధూ రాజీనామాపై ఆమ్ఆద్మీ పార్టీ సైతం విమర్శలు గుప్పించింది. ఒక దళితుడు(చరణ్ సింగ్ చన్నీ) సీఎం కావడం జీర్ణించుకోలేకే సిద్ధూ తన పదవి నుంచి తప్పుకున్నారని ఆరోపించింది.
ఇవీ చూడండి:Bypoll Election: ఆ రాష్ట్రాల్లో ఉపఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..
భాజపాలోకి పంజాబ్ మాజీ సీఎం అమరీందర్?