తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చన్నీనే సీఎం అభ్యర్థి.. సిద్ధూ ఊరుకుంటారా మరి? - కాంగ్రెస్ పంజాబ్ వార్తలు

ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది.. పంజాబ్​ ఎన్నికలకు పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. చన్నీవైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. ఈ నిర్ణయం ఎన్నికల్లో విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం పక్కనబెడితే.. దీని వల్ల పార్టీలో అంతర్గత కలహాలు తప్పదా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ముందు నుంచీ ఆ పదవిని ఆశిస్తున్న సిద్ధూ.. తన అడుగులు ఎటువైపు వేస్తారనేది తేలాల్సి ఉంది.

punjab cm face congress
punjab cm face congress

By

Published : Feb 6, 2022, 5:18 PM IST

Punjab CM candidate congress: పంజాబ్ ఎన్నికలకు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అందరూ ఊహించినట్లే ప్రస్తుత సీఎం చరణ్​జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసింది. సీఎం అభ్యర్థిని ప్రకటించి ఈ విషయంలో అధిష్ఠానం ఎలాగోలా ముందడుగు వేసినా.. తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయన్న అనుమానం అందరిలోనూ నెలకొంది. రాహుల్ గాంధీ నిర్ణయాన్ని అందరం ఆమోదిస్తామని పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రకటించినా.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తప్పవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చన్నీనే ఎందుకంటే?

ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం చరణ్​జిత్ చన్నీవైపే మొగ్గు చూపడానికి పలు కారణాలున్నాయి. అవేంటంటే?

  • Dalit vote percentage in Punjab: పంజాబ్​ జనాభాలో 32 శాతం మంది దళితులు ఉన్నారు. దళిత ముఖ్యమంత్రి అయిన చన్నీ వారి ఓట్లను ఆకర్షించే అవకాశం ఉంది.
  • భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా దళిత ముఖ్యమంత్రులు పదవుల్లో లేరు. ఈ విషయంపై కమలం పార్టీని టార్గెట్ చేస్తూ.. దేశవ్యాప్తంగా దళిత వర్గాన్ని ఆకట్టుకోవచ్చు.
  • దళితులు ఎక్కువగా ఉన్న మాల్వా ప్రాంతంలో పాగా వేస్తే పంజాబ్​లో అధికారం సాధించడం చాలా సులభం. ఈ నేపథ్యంలో చన్నీని ఆ ప్రాంతం నుంచే పోటీ చేయిస్తోంది కాంగ్రెస్ పార్టీ.
  • పంజాబ్ ముఖ్యమంత్రిగా 110 రోజులకు పైగా బాధ్యతలు నిర్వర్తించిన చన్నీ.. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ స్వల్ప వ్యవధిలో దేశంలోని మరే ఇతర ముఖ్యమంత్రి ఇంత వేగంగా తమ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు.
  • చన్నీ అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన్ను సీఎంగా ఎంపిక చేయడం, తదుపరి ఎన్నికలకూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం వల్ల రాష్ట్రంలోని సాధారణ మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలకు సానుకూల సందేశం వెళ్తుంది.

సిద్ధూను కాదని..

sidhu and channi fight: సీఎం అభ్యర్థి రేసులో సిద్ధూ ఉన్నప్పటికీ.. ఆయన్ను ఎంపిక చేసే సాహసం కాంగ్రెస్ చేయలేదు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​తో సన్నిహితంగా మెలుగుతారన్న కారణంతో సిద్ధూను దేశ వ్యతిరేకిగా భాజపా ప్రచారం చేస్తోంది. దీని వల్ల కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో.. విపక్షాలకు అలాంటి అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. దీంతో పాటు, పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో చన్నీనే ముందున్నట్లు తెలిసింది. సిద్ధూ చాలా వెనుకబడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ విధివిధానాలకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడటం కూడా సిద్ధూను దూరం పెట్టడానికి కారణంగా కనిపిస్తోంది.

పార్టీలో కుమ్ములాటలు తప్పవా..?

అంతర్గత విభేదాల సమస్యను దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్ అధిష్ఠానం.. ఇన్ని రోజులూ పార్టీ సీఎం అభ్యర్థిపై నాన్చుడు ధోరణి పాటించింది. సామాజిక మాధ్యమాల్లో పరోక్షంగా చన్నీనే సీఎం అభ్యర్థిని అని ప్రచారం నిర్వహించింది. కానీ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే అన్ని పార్టీలూ తమ సీఎం అభ్యర్థులను ప్రకటించాయి. ఈ విషయంపై కాంగ్రెస్ ఆది నుంచి అయోమయంలోనే ఉంది. ఈ విషయాన్ని గ్రహించి విపక్ష పార్టీలు సైతం ఒత్తిడి పెంచడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఒకరి పేరును తప్పక ఖరారు చేయాల్సిన పరిస్థితి హస్తం పార్టీకి ఏర్పడింది.

అయితే, సిద్ధూ ఇప్పుడు సర్వశక్తులొడ్డి కాంగ్రెస్​ను విజయ తీరాలకు చేర్చుతారా? లేదా పార్టీకి పరోక్షంగా ఝలక్​లు ఇస్తారా? అనేది చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని సిద్ధూ బహిరంగంగానైతే స్వాగతించారు. తనకు అభ్యర్థిత్వం ఇస్తే మాఫియాను అంతం చేస్తానని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తానని చెప్పుకొచ్చారు. ఇతరులను ఎంపిక చేసినా.. తాను నొచ్చుకోనని.. చిరునవ్వుతో అందరినీ కలుపుకొని వెళ్తానని పేర్కొన్నారు.

అయితే, సిద్ధూ ఇదివరకు చేరిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. పార్టీలో కుమ్ములాటలు తప్పవనే అనుమానాలు కలుగుతున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌ను కాంగ్రెస్‌ మాత్రమే ఓడించగలదని, ఇంకెవ్వరికీ అది సాధ్యం కాదని ఇటీవల సిద్ధూ హెచ్చరించారు. తద్వారా సీఎం అభ్యర్థి ప్రకటన తర్వాత కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తలెత్తే ప్రమాదం ఉందన్న సంకేతాన్నిచ్చారు. పైన కూర్చున్న వారు(అధిష్ఠానం) బలహీనమైన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని, కానీ బలమైన ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం పంజాబ్‌ ప్రజల చేతుల్లో ఉందని కూడా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేదానిపైనే 60 మంది పోటీదారుల భవిత ఆధారపడి ఉంటుందని సిద్ధూ అమృత్‌సర్‌లో పేర్కొన్నారు. ఏ పార్టీ పేరును ప్రస్తావించకుండానే ఈ వ్యాఖ్య చేశారు. ముఖ్యమంత్రి చన్నీ మేనల్లుడిని ఈడీ అరెస్టు చేసిన సందర్భాన్నీ సిద్ధూ తనకు అవకాశంగా మార్చుకొనే యత్నం చేస్తున్నారు.

రాజకీయాలు వదిలేస్తారా?

సీఎం అభ్యర్థిగా సిద్ధూను ప్రకటించకపోతే టీవీ షో ప్రయోక్త వృత్తికి తిరిగి వెళ్తారని సిద్ధూ భార్య నవ్‌జోత్‌ కౌర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాలను పూర్తిగా వదిలేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదీ చదవండి:Punjab congress: సీఎం అభ్యర్థి తేలినా.. సిగపట్లు ఆగేనా?

ABOUT THE AUTHOR

...view details