Punjab CM deplaned: మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను విమానం నుంచి దించేశారని ఆరోపించారు శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్. శనివారం మాన్తోపాటు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి దిల్లీ వస్తున్న విమానంలో ఉన్న ప్రయాణికులు ఈ విషయం చెప్పారంటూ ట్వీట్ చేశారు.
"మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో ఉన్న భగవంత్ మాన్ను విమానం నుంచి దించేశారు. దీని వల్ల విమానం 4 గంటలు ఆలస్యమైంది. ఆప్ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరు కాలేకపోయారు. ఈ వార్తలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలను ఇబ్బందిపడేలా చేశాయి. అయితే.. ఈ విషయంపై పంజాబ్ ప్రభుత్వం మౌనం దాల్చింది. అసలు ఏం జరిగిందో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంగా చెప్పాలి. పంజాబ్ సహా జాతి గౌరవంతో ముడిపడిన ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఆయన్ను విమానం నుంచి దించేయడం నిజమే అయితే.. ఇదే విషయంపై జర్మనీ ప్రభుత్వంతో కేంద్రం మాట్లాడాలి" అని ట్వీట్ చేశారు బాదల్.