Punjab CM deplaned in Frankfurt : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎయిర్పోర్ట్ వివాదంపై కేంద్రం దృష్టిసారించింది. మద్యం మత్తులో ఉన్న మాన్‌ను విమానం నుంచి దించేశారని వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఈ ఘటనపై నిజానిజాలు తేల్చడం ముఖ్యమని సింధియా అన్నారు. "ఈ ఘటన విదేశాల్లో జరిగింది. కాబట్టి నిజాలు నిర్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్‌ను వివారాలు కోరతాం. సమాచారం ఇవ్వాలా లేదా అన్న విషయం ఎయిర్‌లైన్ పరిధిలోనిదే. నాకు అందిన రిక్వెస్ట్ ప్రకారం.. ఈ విషయంపై దృష్టిసారిస్తా" అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సింధియా స్పష్టం చేశారు.
ఏం జరిగిందంటే?
ఇటీవల 8 రోజుల జర్మనీ పర్యటనకు వెళ్లారు పంజాబ్ సీఎం. ఆదివారం భారత్‌కు తిరిగొచ్చారు. అయితే.. ఆయన ప్రయాణించిన విమానం రాక ఆలస్యం కాగా.. ఈ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. మాన్.. దిల్లీకి తిరిగి వస్తుండగా విమానం నుంచి దించేశారంటూ శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. శనివారం మాన్తోపాటు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి దిల్లీ వస్తున్న విమానంలో ఉన్న ప్రయాణికులు ఈ విషయం చెప్పారంటూ ట్వీట్ చేశారు. మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో మాన్ ఉన్నారని ట్వీట్లో పేర్కొన్నారు.