పంజాబ్ ముఖ్యమంత్రి గోల్‌కీపర్ అవతారం ఎత్తారు. జలంధర్‌లోని కటోచ్ స్టేడియంలో జరిగిన 'సుర్జిత్ హాకీ టోర్నమెంట్' ఫైనల్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. పంజాబ్ క్రీడా మంత్రి పర్గత్ సింగ్‌తో కలసి ఆయన మ్యాచ్ ఆడారు.
పంజాబ్ క్రీడల మంత్రి పర్గత్ సింగ్ గోల్ చేసేందుకు ప్రయత్నించగా చాకచక్యంగా అడ్డుకున్నారు. పర్గత్ సింగ్ ఒలింపిక్స్ మాజీ క్రీడాకారుడు కావడం విశేషం. ఆయన ఐదు గోల్స్ చేసేందుగు ప్రయత్నించగా మూడింటిని సీఎం చాకచక్యంగా అడ్డుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న హాకీ జట్టు ఆటగాళ్లు చేసిన గోల్స్‌నూ సమర్ధంగా అడ్డుకున్నారు సీఎం.
వాస్తవానికి మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని.. గేమ్ ఆడాల్సిందిగా నిర్వాహకులు కోరారు. దీనికి వెంటనే అంగీకరించిన సీఎం.. మరో మంత్రితో కలసి గోల్ కీపర్‌గా బరిలో దిగారు. 'ఈ మ్యాచ్‌తో తాను కుర్రాడిగా ఉన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.. ఇది తన జీవితంలో అపురూపమైన రోజు' అని మ్యాచ్ అనంతరం చన్ని తెలిపారు. యువతలోని శక్తిని అనుకూలంగా మార్చుకునేందుకు క్రీడలు దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. క్రీడలను ప్రోత్సహించేందుకు పంజాబ్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పంజాబ్‌కు చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించేందుకు ఉన్న ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటామన్నారు.