తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎం పదవికి అమరీందర్​ రాజీనామా- 'అవమానాలు భరించలేకే'

పంజాబ్​ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్(amarinder singh news)​.. తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు చంఢీగఢ్​లోని రాజ్​భవన్​కు వెళ్లి గవర్నర్​​ పురోహిత్​కు తన రాజీనామా లేఖను సమర్పించారు.

amarinder singh
అమరీందర్​ సింగ్​

By

Published : Sep 18, 2021, 4:43 PM IST

Updated : Sep 18, 2021, 10:46 PM IST

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ పంజాబ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామంతో పంజాబ్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

గవర్నర్​కు రాజీనామా లేఖ ఇస్తున్న అమరీందర్​

ఆదివారం సీఎల్​పీ సమావేశానికి పార్టీ పిలుపునిచ్చింది. భేటీకి కొద్ది గంటల ముందు అమరీందర్​.. తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం మీడియా ముందుకొచ్చిన అమరీందర్​.. తనకు అవమానం జరిగిందన్నారు.

"సీఎల్​పీ సమావేశం జరగడం ఇటీవలి కాలంలో ఇది మూడోసారి. నేను ప్రభుత్వాన్ని నడపలేనని వారికి అనుమానం ఉన్నట్టుంది. వాళ్లు(కాంగ్రెస్​ సభ్యులు) నన్ను అవమానించారు. చర్చలు జరిపిన తీరు చూస్తే అది అర్థమవుతుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఉదయం మాట్లాడాను. ఈరోజు రాజీనామా చేస్తానని చెప్పాను. ప్రస్తుతానికి నేను కాంగ్రెస్​ పార్టీలోనే ఉన్నాను. నా మద్దతుదారులతో చర్చించి భవిష్యత్​ కార్యచరణపై నిర్ణయం తీసుకుంటాను. వాళ్లకి(కాంగ్రెస్​ అధిష్ఠానం) ఎవరి మీద నమ్మకం ఉంటే.. వారు సీఎం అవుతారు."

-అమరీందర్​ సింగ్​, పంజాబ్​ మాజీ సీఎం

కెప్టెన్‌ x సిద్ధూ.. ఢీ అంటే ఢీ!

గత కొంత కాలంగా కెప్టెన్‌-సిద్ధూ మధ్య ఎప్పటికప్పుడే తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తడం.. ఇద్దరి మధ్యా పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారడంతో పంజాబ్‌ కాంగ్రెస్‌లో తీవ్ర సంక్షోభం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, అధిష్ఠానం జోక్యంతో అప్పట్లో పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టు కనబడినా.. ఇటీవల మళ్లీ వార్‌ మొదలైంది. పార్టీలో అంతర్గత విభేదాలతో విసిగిపోయానని.. ఇలాంటి అవమానాలు ఇకపై భరించే శక్తి తనకు లేదంటూ ఆయన రాజీనామా చేయడం గమనార్హం. సొంత పార్టీ నేతలే కెప్టెన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడం.. ఆయన ఎన్నికల హామీలు నెరవేర్చనందున సీఎం పదవి నుంచి మార్చాలంటూ దాదాపు 50మంది ఎమ్మెల్యేలు లేఖలో డిమాండ్‌ చేసినట్టు సమాచారం. పార్టీ అధిష్ఠానం కూడా సిద్ధూకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు కూడా లేకపోలేదు. సిద్ధూకి ప్రజల్లో క్రేజ్‌ ఉందని భావిస్తున్న కాంగ్రెస్‌.. ఈ వ్యవహారంపై పట్టించుకోనట్టు వ్యవహరించడం కూడా ఈ పరిస్థితికి కారణమన్న చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురైన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొన్నారు. ఇప్పటికే మూడు సార్లు అవమానాలు ఎదుర్కొన్నానని.. ఇక తనవల్ల కాదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి ఫోన్‌లో చెప్పానని ఆయనే వెల్లడించారు. అలాగే, ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలో పార్టీ అధిష్ఠానం ఇష్టమన్న కెప్టెన్‌.. తన భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానన్నారు.

ఆప్‌కి కలిసొచ్చేలా పరిణామాలు?

గత ఎన్నికల్లో కెప్టెన్‌ ఒంటరి పోరుతోనే పార్టీని విజయతీరాలకు చేర్చారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సహకారం తీసుకున్నప్పటికీ అంతా తానై వ్యవహరించి భాజపా-అకాలీదళ్‌ కూటమి, ఆప్‌లను ఎదుర్కొని పార్టీని విజేతగా నిలిపారు. అంతకముందు పార్టీ నిర్మాణంలో, బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఈ నాలుగున్నరేళ్లలో సామాన్య కార్యకర్తల నుంచి ఒక స్థాయి నాయకుల వరకూ ఎవరికీ కెప్టెన్‌ అందుబాటులో లేకుండా పోయారని, అందువల్ల ఈసారి ఆయన సారథ్యంలో 2022 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశమే లేదని పార్టీ వర్గాలు గతంలోనే పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో లాభించే అవకాశం ఉంది. దీనికితోడు, ఈసారి అకాలీదళ్‌, భాజపా ఒంటరిగా పోటీ చేస్తుండటం కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశమే అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆప్‌.. ఈసారి అక్కడ పాగావేయాలని వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న సంక్షోభం, అనైక్యత వచ్చే ఎన్నికల్లో ఆప్‌ విజయావకాశాలకు మరింతగా తోడ్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌, కర్ణాటక, గుజరాత్‌లో ఎన్నికలకు ముందు భాజపా కూడా సీఎంను మార్చే వ్యూహాన్ని అనుసరిస్తోంది. దీంతో కాంగ్రెస్‌ కూడా అదే బాటలో వెళ్తోందా? అన్న వ్యాఖ్యానాలు కూడా వెలువడుతున్నాయి.

వీరసైనికుడు..

పటియాల రాజవంశానికి చెందిన అమరీందర్‌ సింగ్‌ డిగ్రీ చదివిన అనంతరం సైన్యంలో చేరారు. ఆయన తండ్రి, తాతలు కూడా సైన్యంలో విధులు నిర్వహించడం విశేషం. 1971లో పాక్‌తో జరిగిన యుద్దంలో ఆయన పాల్గొన్నారు. రిటైర్మెంట్‌ తరువాత అప్పటి కాంగ్రెస్‌ యువనేత రాజీవ్‌గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌లో చేరి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. 1984 ఆపరేషన్‌ బ్లూస్టార్‌ను నిరసిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. శిరోమణి అకాలీదళ్‌ (లోంగ్‌వాల్‌ )లో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొంతకాలం తర్వాత తిరిగి కాంగ్రెస్‌లోనే చేరారు. అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్‌కు తిరుగులేని నేతగా కొనసాగారు.

ఇదీ చూడండి:-పంజాబ్‌లో సిద్ధూ రాజకీయ కేళి- సీఎం పదవి కోసమేనా?

Last Updated : Sep 18, 2021, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details