TRANSFER OF CHANDIGARH TO PUNJAB: కేంద్ర పాలిత ప్రాంతం, పంజాబ్, హరియాణాల ఉమ్మడి రాజధాని అయిన చండీగఢ్‌పై మళ్లీ వివాదం మొదలైంది. చండీగఢ్‌లోని పరిపాలన, ఉమ్మడి ఆస్తుల నిర్వహణలోని సమతుల్యతకు కేంద్ర సర్కారు విఘాతం కలిగిస్తోందని ఆరోపిస్తూ ఈ నగరాన్ని తక్షణమే తమ రాష్ట్రానికి బదిలీ చేయాలని పంజాబ్ అసెంబ్లీ శుక్రవారం తీర్మానించింది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రతిపాదించగా భాజపా మినహా అన్ని పార్టీలు...ఆప్, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ సమర్థించాయి. తీర్మానంపై ఓటింగ్ సమయంలో భాజపా ఇద్దరు ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ అన్ని పార్టీల ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. చండీగఢ్ కేంద్ర పాలిత ఉద్యోగులకు సెంట్రల్ సర్వీస్ నిబంధనలు వర్తిస్తాయంటూ గత ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ నిబంధనల ప్రకారం చండీగడ్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెరిగింది. మహిళా ఉద్యోగులకు శిశు సంరక్షణ సెలవు ప్రస్తుతమున్న ఏడాది నుంచి రెండేళ్లకు పెరిగింది. సెంట్రల్ సర్వీసు నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వ ఈ చర్యతో చండీగఢ్‌ను పంజాబ్‌కు బదిలీ చేయాలన్న పాత డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది. పంజాబ్ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వ విఘాతం కలిగిస్తోందంటూ ఆప్, కాంగ్రెస్, శిరోమణిఅకాలీదళ్ తదితర పార్టీలు ధ్వజమెత్తాయి. చండీగఢ్ బదిలీపై తీర్మానం చేసేందుకే పంజాబ్ అసెంబ్లీ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైంది.
బదిలీ కోరుతూ గతంలోనూ తీర్మానాలు:చండీగఢ్‌ను పంజాబ్‌కు బదిలీ చేయాలన్న తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...‘రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసి రాష్ట్రానికి చండీగఢ్‌ను బదిలీ చేయాలని కోరుతాం. అందుకోసం శాయశక్తులా కృషి చేస్తాం. అసెంబ్లీలో, పార్లమెంటులో, ఇతర వేదికలపైనా గట్టిగా పోరాడుతాం’ అని తెలిపారు. గత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చండీగఢ్ బదిలీ కోసం తీర్మానాలు చేశాయని మాన్ గుర్తు చేశారు.