పంజాబ్‌లోని డేరా బస్సీ ప్రాంతంలో నడిరోడ్డుపై సోమవారం అర్ధరాత్రి పోలీసు కాల్పులు జరపడం స్థానికంగా కలకలం రేపింది. రోడ్డు మీద నిల్చున్న కొందరితో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసు అధికారి ఓ యువకుడిపై కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్ గాయం తగిలి.. బాధితుడు రోడ్డు మీద విలవిలలాడాడు.
అసలేం జరిగిందంటే..డేరా బస్సీ ప్రాంతంలోని సోమవారం రాత్రి ఓ కుటుంబం వేరే ప్రదేశానికి వెళ్లడానికి రోడ్డుపైకి వచ్చి నిల్చున్నారు. అదే సమయంలో రోడ్డుపై పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు.. వారి దగ్గరకు వెళ్లి తనిఖీ కోసం బ్యాగులు ఓపెన్ చేయమన్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వారిలో హితేశ్ అనే యువకుడిపై కాల్పుడు జరిపాడు సబ్ఇన్స్పెక్టర్. బుల్లెట్ అతడి తొడలో దూసుకెళ్లి తీవ్ర రక్తస్రావమైంది. బాధితుడు ప్రస్తుతం ఛండీగఢ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే బ్యాగులు ఓపెన్ చేయమన్నందుకు యువకుడితో పాటు అతడి బంధువులు తమపై దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. యూనిఫామ్‌ను చింపడానకి ప్రయత్నించారని, అందుకే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. అయితే బాధితులు మాత్రం ఇది ఉద్దేశపూర్వక దాడి అని ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం ఘటనను కొందరు స్థానికులు ఫోన్లలో చిత్రీకరించారు. ఆపై సోషల్‌మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి వైరల్‌గా మారాయి.