తెలంగాణ

telangana

By

Published : Jul 25, 2021, 11:03 AM IST

ETV Bharat / bharat

రోడ్డు భద్రతపై చిన్నారులకు వినూత్న శిక్షణ

ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు పుణె మున్సిపల్ కార్పొరేషన్‌ ఓ సరికొత్త ప్రయోగం చేపట్టింది. భవిష్యత్తులో రహదారి ప్రమాదాలను నివారించేందుకు 12 ఏళ్లలోపు చిన్నారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్, సిగ్నేజ్, క్రాసింగ్, స్పీడ్ బ్రేకర్స్, ఫుట్‌పాత్‌లు సైకిల్ ట్రాక్‌లను నిర్మించి చిన్నారులకు అనుభవ పూర్వకంగా రోడ్డు భద్రతపై శిక్షణ ఇస్తోంది.

pune, traffic park
ట్రాఫిక్ పార్కు, పుణె

ట్రాఫిక్ పార్కు, పుణె

వాహనం బయటకు తీయాలంటే భయం. రోడ్డెక్కాలంటే ఇంకా భయం. ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ వాహనం ఢీ కొడుతుందో అని ఒకటే ఆందోళన. అయినా తప్పక ప్రయాణం చేయాల్సిన పరిస్ధితి. దీన్ని కొంతైనా నివారించి రోడ్డు ప్రమాదాలను కట్టడి చేసేందుకు సిద్ధమైంది పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌. 12 ఏళ్లలోపు చిన్నారులకు ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్‌ పార్క్‌ను ఏర్పాటు చేసింది. పిల్లలకు చిన్నప్పటి నుంచే ట్రాఫిక్‌ నియమాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తోంది. 12 ఏళ్ల వయస్సులోపు పిల్లలకు గ్రహణ శక్తి అధికంగా ఉంటుందని తెలిపిన అధికారులు.. భవిష్యత్తులో ఈ శిక్షణ వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. దేశంలో ఇలాంటి ట్రాఫిక్‌ పార్కు మరెక్కడా లేదని పేర్కొన్నారు.

28 సైకిళ్లు, హెల్మెట్లు..

పుణె ట్రాఫిక్‌ పార్కును 160 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు రహదారి నమూనాతో రూపొందించారు. సూక్ష్మ పరిమాణంలో ట్రాఫిక్ సిగ్నల్స్, క్రాసింగ్, స్పీడ్ బ్రేకర్స్, ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లను నిర్మించారు. పార్క్‌లోకి ప్రవేశించగానే చిన్నారులకు పెద్ద పెద్ద తెరలపై ట్రాఫిక్‌ నిబంధనలను నిర్వాహకులు బోధిస్తారు. రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతారు. ఆ తర్వాత అనుభవ పూర్వకంగా ట్రాఫిక్‌ నిబంధనలు అనుసరించేలా పార్కులో తగిన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 28 సైకిళ్లు, హెల్మెట్లను పిల్లలకోసం అందుబాటులో ఉంచారు. హెల్మెట్లు ధరించిన పిల్లలు సైకిళ్లు తొక్కుకుంటూ అనుభవ పూర్వకంగా ట్రాఫిక్‌ నిబంధనలు నేర్చుకుంటున్నారు. సిగ్నళ్లను అనుసరించడం, రహదారిపై ఉండే స్పీడ్ బ్రేకర్లు, జీబ్రా క్రాసింగ్ వంటి గుర్తుల వద్ద వ్యవహరించే తీరును పార్కులో నేర్పిస్తున్నారు. విద్యార్థి స్థాయి నుంచే ట్రాఫిక్‌ నిబంధనల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలను తగ్గించ వచ్చని అధికారులు చెబుతున్నారు.

పుణె ట్రాఫిక్‌ పార్కులో ఇప్పటి వరకు 11 పాఠశాలలకు చెందిన విద్యార్థులకు రోడ్డు భద్రత గురించి శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇతర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్‌ పార్కులు ఏర్పాటు చేసి ఎక్కువ మంది విద్యార్థులకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:మాస్కులు, కరోనా కిట్లతో బాబా ఆలయ అలంకరణ

ABOUT THE AUTHOR

...view details