దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. దాదాపు మూడు లక్షలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూలు, వారాంతపు లాక్డౌన్లు విధించగా.. మరికొన్ని రాష్ట్రాలు ఆ కఠిన ఆంక్షలు దిశగా అడుగులేస్తున్నాయి.
పుదుచ్చేరిలో లాక్డౌన్..
కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా పుదుచ్చేరి నాలుగు రోజుల పాటు లాక్డౌన్ విధించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 23 నుంచి 26 వరకు ఆంక్షలు విధించనున్నట్లు పేర్కొంది.
పుదుచ్చేరిలో పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకు రాత్రి కర్ఫ్యూ విధించిన పుదుచ్చేరి ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకుంది.
10 శాతం ఉద్యోగులే!
వైరస్ విజృంభణ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులు నిర్వహించేందుకు 10 శాతం ఉద్యోగులే హాజరవ్వాలని కోరింది. జల, విద్యుత్, పోలీసు, ఆరోగ్య శాఖకు సంబంధించిన సేవల్లో పనిచేసేవారికి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. మిగతా శాఖల్లో ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
అత్యవసర సేవలు మినహా ఇతర అన్ని సేవలను ఆపేయాలని పేర్కొంది.
ఉత్తరాఖండ్లో కఠిన ఆంక్షలు..
కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో 13 జిల్లాల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్న ఉత్తరాఖండ్ రాష్ట్రం మరో నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో రాత్రి 7 గంటలకే కర్ఫ్యూ మొదలవుతుందని పేర్కొంది. దుకాణాలు, అత్యవసరం కాని సేవలకు సంబంధించిన షాపులను మధ్యాహ్నం 2 గంటల నుంచి మూసివేయాలని ఆదేశించింది.
దిల్లీలో వారాంతపు లాక్డౌన్ కారణంగా సొంత ప్రాంతానికి తిరిగి వస్తున్న వారు కొవిడ్ రిపోర్టును తప్పకుండా తీసుకురావాలని ఉత్తరాఖండ్ సర్కారు నియమం పెట్టింది. స్కూళ్లు, కళాశాలలు మూసివేస్తున్నట్లు తెలిపింది.
డీఆర్డీఓ సేవలు..
రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ).. హరియాణాలో 500 బెడ్ల సామర్థ్యం కల రెండు కొవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు. పానిపట్, హిసార్ ప్రాంతాల్లో ఈ ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కొవిడ్ ఆసుపత్రుల్లో సేవలందించేందుకు వైద్యులు, నర్సులను ఏర్పాటు చేయమని డీఆర్డీఓ కోరినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:కొవిషీల్డ్ టీకా ధర ప్రకటించిన సీరం