ఆలయంలో సేవలు అందించే ఏనుగు బుధవారం నడుస్తూనే ఒక్కసారిగా కుప్పకూలి, ప్రాణాలు విడవడం.. భక్తులు, స్థానికుల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన పుదుచ్చేరిలో జరిగింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జానకీ రామన్ 1996లో పుదుచ్చేరిలోని మనక్కుల వినాయకుని సన్నిధికి లక్ష్మీ అనే ఓ ఏనుగును బహూకరించారు. ఐదేళ్ల వయసులో ఆలయానికి వచ్చిన లక్ష్మీ అప్పటి నుంచి అక్కడే ఉంటూ ఆలయానికి వచ్చే భక్తులకు ఆశీస్సులు అందించేది. లక్ష్మీని చూసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు తరలివచ్చేవారు. ఆలయానికి వచ్చిన భక్తులు తప్పకుండా లక్ష్మీని కలిసి మరి వెళ్లేవారు. 32 ఏళ్లుగా గుడిలో అంత స్నేహపూర్వకంగా ఉన్న ఆ ఏనుగు బుధవారం ఉదయం సుమారు 6:30 సమయంలో వాకింగ్‌కు వెళ్తూ అకస్మాత్తుగా కింద పడిపోయింది.
వాకింగ్ చేస్తూ గుండెపోటుతో ఏనుగు మృతి.. తీవ్ర విషాదంలో భక్తులు.. ఘన నివాళులు - Puducherry temple elephant lakshmi
పుదుచ్చేరిలోని మనక్కుల వినాయకుని సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరు ఆ వినాయకునితో పాటు 'లక్ష్మీ' ఆశీర్వాదం పొందాలని కోరుకుంటారు. ఐదేళ్ల వయసులో ఆలయానికి వచ్చిన ఆ ఏనుగు దాదాపు 32 ఏళ్లపాటు దేవుని సన్నిధిలో సేవలందించి వచ్చిన భక్తులందరికి ఆశీస్సులు అందించేది. ఇంతటి ప్రాచుర్యం గల లక్ష్మీ బుధవారం కన్నుమూసింది. దీంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకుంది.
Puducherry temple elephant lakshmi
విషయం తెలుసుకున్న ఆలయ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకోగా అప్పటికే లక్ష్మీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే మృతికి గల కారణం గుండెపోటు అయ్యుండచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఏనుగు మృతదేహాన్ని భక్తుల సందర్శనార్థం ఆలయం వద్ద ఉంచిన సిబ్బంది శవ పరీక్ష తర్వాత బుధవారం సాయంత్రం కురుసుకుప్పంలోని అక్కసామి మఠంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. దాదాపు 32 ఏళ్లు ఆలయానికి సేవ చేసిన లక్ష్మీ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
Last Updated : Nov 30, 2022, 1:49 PM IST