డెల్టా రకం వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కొవిషీల్డ్ రెండో డోసు టీకా కాల పరిమితిని 12-16 వారాల నుంచి 8 వారాలకు తగ్గించడం మేలని ప్రముఖ వైద్యులు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి సూచించారు. బ్రిటన్‌లో గత డిసెంబరులో అప్పటి ఒరిజినల్ రకం వైరస్‌ను దృష్టిలో ఉంచుకొని కాల వ్యవధిని పెంచారని, ఆ తర్వాత డెల్టా వేరియంట్ ప్రాబల్యం పెరగడంతో టీకా వ్యవధిని తగ్గించారని గుర్తు చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యాక్సిన్ విధానంలో ఇలా మార్పులు చేస్తూ పోవాలన్నారు. ప్రస్తుతం మన దేశంలో 50% డెల్టా రకం వైరస్ ఉన్నట్లు ప్రభుత్వ అధ్యయనాలే చెబుతున్నందున.. కొవిషీల్డ్ రెండో డోసు కాల వ్యవధిని 8 వారాలకు తగ్గించి ముప్పు తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి గరిష్ఠ రక్షణ కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఈనాడు'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దేశంలోని ప్రస్తుత పరిస్థితులను, చేపట్టాల్సిన చర్యలను శ్రీనాథ్ రెడ్డి విశ్లేషించారు.
వ్యాక్సిన్ కొరత వల్లే కొవిషీల్డ్ కాలపరిమితిని పెంచారా? లేక శాస్త్రీయ ఆధారాల ప్రకారమా
అది ప్రభుత్వ విధానం కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడదలచుకోలేదు. డెల్టా రకం వైరస్‌ను దృష్టిలో ఉంచుకొని మాత్రమే కొవిషీల్డ్ డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించాలని చెబుతున్నా! విదేశాల అనుభవాలు, మన దేశంలో జరిగిన అధ్యయనాల ప్రకారం డెల్టా రకంపై తొలి డోస్‌తోనే పూర్తిస్థాయి రక్షణ దొరకదు. తొలి డోస్‌తో కేవలం 33 శాతం రక్షణే అని బ్రిటన్ అనుభవం చెబుతోంది. రెండో డోసుతోనే రక్షణ ఉంటుంది కాబట్టి రెండు డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించాలని ఇప్పటివరకు ఉన్న అధ్యయనాలన్నీ చెబుతున్నాయి. మిగిలిన దేశాల్లో 8 వారాలకు తగ్గించారు. ఆ అనుభవాన్ని మనమూ గుర్తించాలి. మన దేశంలో డెల్టా వేరియంటే ప్రబలంగా ఉందంటున్నారు. ఐసీఎంఆర్‌తోపాటు పలు అధ్యయనాల్లో ఇదే తేలింది. కాబట్టి మనమిప్పుడు జనవరి నాటి పరిస్థితులను కాకుండా జూన్‌లో స్థితిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. మార్చుకోవాలి.
ఇదీ చదవండి:Covaxin: పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ షురూ
కరోనా ఉద్ధృతి తిరోగమనంలో సాగుతున్నా వ్యవధి తగ్గించాలా
గతం కంటే కేసులు తగ్గడం మంచిదే. ప్రస్తుతం చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. అది ఎత్తేసిన తర్వాత కూడా కేసులు తగ్గుతాయా? పెరుగుతాయా? అనేది తెలియదు. కేసులైతే ఎక్కడా సున్నాకు రాలేదు. వైరస్ వల్ల ఇప్పటికీ కొంత మంది ప్రమాదాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. బ్రిటన్ లాంటి దేశమే తాము లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేయడం లేదని ప్రకటించింది. డెల్టా వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకొని వాళ్లు జాగ్రత్త పడుతున్నారు. అమెరికా ఎఫ్‌డీఏ కమిషనర్ స్కాట్ గాట్‌లిబ్- తాజాగా తమ దేశంలోనూ డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల మనకు ముప్పు పూర్తిగా తొలగిపోయిందని అనుకోవడానికి వీల్లేదు. అందరికీ రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతోనే మనం వ్యాక్సినేషన్ విధానం అవలంబిస్తున్నాం. అలాంటప్పుడు డెల్టా వేరియంట్ వల్ల వచ్చే ప్రమాదాన్ని పసిగట్టి టీకా విధానంలో మార్పులు తేవాలి.
ఇదీ చదవండి:రూ.500లకే రెండు డోసుల టీకా!
ముప్పు ఎక్కువ ఉన్నవారికి రెండో డోసు కాల వ్యవధి తగ్గించి ఇస్తే చాలా..
మన ప్రభుత్వం 45 ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలకు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఈ విధానాన్నే అనుసరిస్తే చాలు. వీరితో పాటు గర్భిణులకూ టీకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. అంతర్జాతీయంగా గర్భిణులకు వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ఫైజర్ టీకా ఇస్తున్నారు. ఆస్ట్రాజెనికాను యుక్తవయస్సు వారికి ఇవ్వకూడదని యూకే నిర్ణయించింది. అందువల్ల అది వద్దనుకుంటే భారత్‌లో కొవాగ్జిన్ అయినా గర్భిణులకు ఇవ్వొచ్చు. వీరిపై ట్రయల్స్ జరగలేదు కాబట్టి.. అనుభవాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత వచ్చిన అనుభవాల ఆధారంగానే అమెరికా, బ్రిటన్, యూరప్‌లలో గర్భిణులకు టీకాలివ్వొచ్చని నిర్ణయించారు. ఆ అనుభవాలను మనం గమనంలోకి తీసుకోవాలి. అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సిన్‌ను వారికి ఇవ్వాలన్న దానిపై నిపుణులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్పితే, వారికి ఏ వ్యాక్సిన్ కూడా ఇవ్వకూడదన్న ఆలోచన మాత్రం మంచిది కాదు.
ఇదీ చదవండి:దుష్ప్రభావాలు లేకుంటే టీకా పనిచేయనట్లేనా..?
వ్యాక్సినేషన్ తర్వాత కూడా వైరస్ సోకి ఆసుపత్రిలో చేరినట్లు అపోలో ఆసుపత్రుల జేఎండీ సంగీతారెడ్డి ప్రకటించారు! ప్రజల్లో వ్యాక్సిన్‌పై అనుమానాలు పెరిగే అవకాశం ఉండదా
ఫైజర్‌తో పాటు ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సిన్ ఇచ్చినా రోగం తీవ్రరూపం దాల్చకుండా 95% రక్షణ లభిస్తుంది. అంతేతప్ప అసలు వైరసే సోకకుండా ఏ వ్యాక్సినూ 100% రక్షణ కల్పించలేదు. ట్రయల్స్‌లో పరిశీలించింది కూడా మరణాల నుంచి టీకాలెంతమేరకు రక్షణ కల్పిస్తాయన్న దానిపైనే. వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా టీకాలు ఆపలేవు. కానీ ప్రవేశించిన తర్వాత లక్షణాలు లేకుండా, లేదంటే తేలికపాటిగా ఉండేట్లు చూస్తాయి. కొంతమందికి కొంత సీరియస్ కూడా కావొచ్చు. అయితే అత్యధిక మందికి మృత్యు భయం ఉండదు. అందువల్ల ఎవ్వరూ టీకా అనేది వైరస్ సోకకుండా ఆపుతుందనే అపోహలు పెట్టుకోకూడదు. ప్రస్తుతం ముక్కు ద్వారా పీల్చుకొనే వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. అవి వస్తే వైరస్‌ను అరికట్టడానికి వీలవుతుందేమో! ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ల వల్ల ఐజీజీ, ఐజీఎం యాంటీబాడీస్ ఉత్పత్తి అయితే ముక్కు ద్వారా తీసుకొనే వ్యాక్సిన్‌తో ఐజీఏ యాంటీబాడీస్ కూడా తయారవుతాయి. వైరస్ ముక్కులోకి, గొంతులోకి ప్రవేశించినప్పుడు ఈ ఐజీఏ యాంటీబాడీలు ఊడ్చేసే అవకాశం ఉంది. కారులో పోతున్నప్పుడు సీటు బెల్టు వేసుకుంటే ప్రమాదం సంభవించినా చాలావరకు రక్షణ లభిస్తుంది. అయితే దెబ్బలు తగలకుండా బెల్ట్ ఆపలేదు. చిన్న దెబ్బలు తగలొచ్చు. వ్యాక్సిన్లు కూడా అలాగే పనిచేస్తాయి.