PUBG Addiction: పబ్జీ ఆటలో పడి పిల్లలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. దానికి బానిసలుగా మారుతున్నారు. ఇదే ఆట మోజులో పడి సొంత ఇంట్లో నుంచే రూ. 8 లక్షలు కాజేసి మరొకరికి ఇచ్చారు అన్నదమ్ములు. అసలు విషయం తెలిసి వాళ్ల తండ్రి షాకయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు చెన్నైలోని టేనంపేట్ ప్రాంతానికి చెందిన నటరాజన్‌కు ఇద్దరు కుమారులు. 10,12వ తరగతి చదువుతున్నారు. కిరాణా దుకాణం నడిపే నటరాజన్.. కొత్త ఇల్లు కొందామని రూ. 8 లక్షలు షాప్‌లో రహస్యంగా దాచాడు. కొద్దిరోజులకు ఆ డబ్బు మాయమైంది.
పోయిన డబ్బు గురించి అనుమానంతో కుమారులనే పలుమార్లు అడిగాడు నటరాజన్. చివరకు వాళ్లే తీసినట్లు ఒప్పుకున్నారు.
ఏం చేశారంటే..?
PUBG Addiction 8 Lakhs Stolen: రూ. 8 లక్షలు ఏం చేశారని తండ్రి నిలదీయగా అసలు విషయం చెప్పారా అన్నదమ్ములు. పబ్జీ బాగా ఆడే తమ 15 ఏళ్ల స్నేహితుడి కనెక్షన్ కోసం అతడికి ఇచ్చినట్లు తెలిపారు.
దీంతో తన డబ్బు కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు నటరాజన్.
పోలీసులు నటరాజన్ కుమారుల స్నేహితుడిని ప్రశ్నించగా.. తన తల్లిదండ్రులకు ఇచ్చినట్లు చెప్పాడు.
తమ కుమారుడితో పబ్జీ ఆడేందుకు నటరాజన్ పిల్లలు.. ఎప్పుడూ ఇంటికి వస్తున్న విషయాన్ని గమనించారు రాజశేఖర్, పుష్పరాణి దంపతులు. ఇష్టమైన ఆహారం కావాలంటే డబ్బులు తీసుకురావాలని పబ్జీలో నిమగ్నమైన పిల్లలిద్దరినీ ఒప్పించారు. ఈ నేపథ్యంలోనే రూ. 8 లక్షలు వారికి ఇచ్చినట్లు తేలింది.