28 ఏళ్లుగా శరీరంలో తూటాలతో జీవనం సాగించిన కర్ణాటక చామరాజనగర్‌కు చెందిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సిద్ధరాజనాయక(59) బుధవారం ప్రాణాలు కోల్పోయారు. రిటైర్మెంట్కు ఐదు రోజులు ఉండగా గుండెపోటుతో మరణించారు.
1993లో వీరప్పన్‌కు- పోలీసులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో సిద్ధరాజనాయక తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో రామాపుర్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. పోలీసులపై వీరప్పన్ జరిపిన కాల్పుల్లో సిద్ధరాజనాయకకు ఐదు బుల్లెట్లు తగిలాయి. మృత్యువుతో పోరాడి ప్రాణాలు దక్కించుకున్నారు.
ఆయనకు చికిత్స అందించిన వైద్యులు.. సిద్ధరాజనాయక శరీరంలోని నాలుగు బుల్లెట్లను తొలగించారు. మరో బుల్లెట్ మాత్రం తలలోకి దూసుకెళ్లింది. బుల్లెట్ ముక్కలు ఎడమ కంటి సమీపంలో ఇరుక్కుపోయాయి. వాటిని తొలగిస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం ఉన్న నేపథ్యంలో బుల్లెట్ ముక్కలను అలాగే ఉంచారు వైద్యులు. తలలో తూటాలతోనే ఇన్నేళ్లు జీవించారు.
అయినప్పటికీ ఇన్నేళ్లు ఎలాంటి ఆటంకం లేకుండానే పని చేశారు సిద్ధరాజనాయక. లాక్డౌన్ సమయంలోనూ విధులు నిర్వర్తించారు. మానవతావాదిగా ఆయనకు మంచి పేరు ఉంది.
ఇదీ చదవండి:లైవ్ వీడియో: నిశ్శబ్దంగా శునకాన్ని వేటాడిన మొసలి