Yashwant Sinha news: తాను గిరిజనుడిగా పుట్టకపోయినా వారి కోసం ద్రౌపది ముర్ము కంటే ఎక్కువ సేవే చేశానని ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా చెప్పారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో దిగిన ముర్ము గతంలో ఝూర్ఖండ్ గవర్నర్ సహా వివిధ హోదాల్లో ఉన్నప్పుడు ఆదివాసీల కోసం ఏమైనా చేసి ఉంటే ఆ వివరాలను బయటపెట్టగలరా అని ప్రశ్నించారు. గురువారం 'ఈటీవీ భారత్'తో, పీటీఐ వార్తాసంస్థతో వేర్వేరుగా ఆయన మాట్లాడారు. ఒక సామాజిక వర్గంలో జన్మించినంత మాత్రాన వారందరిపై ఆటోమేటిగ్గా ఛాంపియన్ అయిపోలేరని వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు తాను ప్రవేశపెట్టిన ఐదు బడ్జెట్లలోనూ బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసినట్లు చెప్పారు.
ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేందుకే..
'ప్రధాని మోదీ పాలనలో ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ఏర్పడింది. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ముర్ము, సిన్హా ఎవరనేది పక్కనపెట్టి మేం ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధాంతాల మధ్య సమరంగా ఈ ఎన్నికలను చూడాలి. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నేను కట్టుబడి ఉన్నాను. వాజ్‌పేయీ హయాంలో ఉన్న భాజపాకు, మోదీ హయాంలో భాజపాకు చాలా వ్యత్యాసం ఉంది. వాజ్‌పేయీ గొప్ప పార్లమెంటేరియన్, ప్రజాస్వామ్యవాది. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే భాగస్వామ్య పార్టీలతో పాటు, ప్రతిపక్షాలతోనూ చర్చలు జరిపేవారు. ఏకాభిప్రాయం సాధించేవారు. మోదీ సర్కారు అలాంటిది కాదు' అని సిన్హా చెప్పారు. ప్రస్తుత భాజపాకు ఆనాటి భాజపాకు ఉన్న గుర్తింపు లేదని విమర్శించారు.