Protests in Telangana Condemning Chandrababu Arrest : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు(Chandrababu Arrest)ను నిరసిస్తూ.. ఆయన అభిమానులు తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పలు జిల్లాల్లో నిరసనలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కార్యకర్తలు మౌనప్రదర్శన(silent demonstration) చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లేకున్న రాజకీయ కక్షతోనే... అక్రమ అరెస్టు చేశారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ తగ్గించలేరన్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ.. భద్రాద్రి కొత్తగూడెంలోని తెలుగుదేశం శ్రేణులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. పసుపు పార్టీ నేతలతో పాటు అభిమానులు పాల్గొని.. ప్రధాన కూడలిలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సైకో సీఎం డౌన్ డౌన్.. చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు.
TDP Chief Chandrababu Naidu Arrest :రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్టు చేశారని.. తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలు సుహాసిని అన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఆ పార్టీ అనుబంధం సంఘమైన తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ నిరసన చేపట్టింది. టీఎన్‌టీయూసీ నేతలు చేపట్టిన మౌనప్రదర్శనకు తెలుగుదేశం నాయకురాలు నందమూరి సుహాసిని మద్దతు తెలిపి.. అంబేడ్కర్ విగ్రహానికి వినతీపత్రం అందజేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్.. గొప్పనాయకుడిపై అక్రమంగా కేసులు పెట్టించారని సుహాసిని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ తగ్గించలేరని ఆమె చెప్పారు.
సైకో జగన్ రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి చంద్రబాబుపై కక్షపూరీతంగా వ్యవహరిస్తూ.. అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని కమ్మ సంఘం నాయకుడు వెంకట కృష్ణ మండిపడ్డారు. చంద్రబాబును తక్షణ విడుదల చేయాలంటూ.. టీడీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో 200 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు.