Protests Continue Against Chandrababu Arrest: అవినీతి కేసుల్లో జైలు జీవితం గడిపిన జగన్.. అందరూ జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ భిన్నరూపాల్లో పార్టీ నేతలు, శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల దీక్షా శిబిరాలను జనసేన, సీపీఐ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు.
చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రిలే దీక్షల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్ధవటం మండలం సాకరాసపల్లెలో టీడీపీ సీనియర్ నాయకులు చమర్తి జగన్ రాజు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడులో వీర్లయ్య ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాళహస్తిలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు గోపినాథ్ అరగుండు కొట్టించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, సీపీఐ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో దీక్షా శిబిరాన్ని జనసేన నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. కర్నూలు జిల్లా కోడుమూరులో రిలే దీక్షల్లో నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. కర్నూలులో దీక్షలకు వీరశైవ సామాజిక వర్గానికి చెందిన వారు మద్దతు తెలిపారు. నంద్యాల జిల్లా గుటుపల్లిలోని పెద్దరాజు స్వామి దర్గా వద్ద 101 టెంకాయలు కొట్టి టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. నంద్యాలలోనూ టీడీపీ దీక్షలు కొనసాగాయి.
నెల్లూరు బారాషాహీద్ దర్గాలో తెలుగుదేశం నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ నేతలు చంద్రబాబుకు మద్దతుగా దైవానుగ్రహ పాదయాత్ర చేపట్టారు. కోవూరులోని వీరాంజనేయ ఆలయం నుంచి బుచ్చి మండలం జొన్నవాడ కామాక్షితాయి ఆలయం వరకు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. పలు ఆలయాల్లో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగు మహిళలు ఇంటింటికీ తిరుగుతూ బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో టీడీపీ దీక్షలు కొనసాగాయి.