శుక్రవారం హింస జరిగిన రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హింసకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో శుక్రవారం జరిగిన హింసాత్మక ఆందోళనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మత ప్రబోధకుడిపై భాజపా మాజీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరనస చేపట్టారు. అది కాస్తా హింసాత్మకంగా మారడంతో పోలీసులు సహా 12 మంది.. గాయపడ్డారు. రాంచీ సీనియర్ ఎస్పీ సురేంద్ర కుమార్ ఝా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు తల సహా ఇతర శరీర భాగాల్లో గాయలైనట్లు వైద్యులు తెలిపారు. తమ ఆసుపత్రికి తీసుకొచ్చిన క్షతగాత్రుల్లో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయినట్లు రాంచీలోని "రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్"వైద్యులు ధ్రువీకరించారు. తుటా గాయాలతో ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
రాంచీలో జరిగిన హింసలో కార్లు, దుకాణాలు సహా భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ విధించారు. ఆందోళన జరిగిన ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అంతర్జాల సేవలు నిలిపేశారు. శుక్రవారం ఘటనలు నిరసిస్తూ.. రాంచీలో హిందూ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు. పరిస్థితి నియంత్రణలోనే ఉందని డీఐజీ అనీశ్ గుప్తా తెలిపారు. హింసకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు.
ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశం:ఝార్ఖండ్ రాజధాని రాంచీలో శుక్రవారం చెలరేగిన హింసాత్మక ఆందోళనలపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్. సీనియర్ ఐఏఎస్ అధికారి అమితాబ్ కౌశల్, ఏడీజీ సంజయ్ లత్కర్లతో కూడిన ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. వారంలోపు నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. మరోవైపు.. ప్రత్యేక దర్యాప్తు బృందం(సీట్)ను సైతం ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఇప్పటి వరకు మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు చెప్పారు. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని పట్టుకునేందుకు తనిఖీలు చేపట్టామన్నారు.
యూపీలో అరెస్టులు: ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం హింసకు సంబంధించి 227మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రయోగరాజ్‌లో 68 మందిని, హథరస్‌లో 50మందిని, షహారాన్‌పూర్‌లో 48, అంబేడ్కర్‌నగర్‌లో 28, మొరాదాబాద్‌లో 25, ఫిరోజాబాద్‌లో 8 మందిని అరెస్ట్ చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ఏడీజీపీ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. ఆయా నగరాల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం ఆందోళనకు దిగిన నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పలు చోట్ల వాహనాలకు నిప్పు పెట్టారు. శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని అన్ని నగరాల్లో పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
రంగంలోకి బుల్డోజర్లు:ఉత్తర్‌ప్రదేశ్‌సర్కారు మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. మత ప్రబోధకుడిపై భాజపా మాజీ నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాన్పూర్‌లో ఈనెల 3న జరిగిన హింసలో ప్రధాన నిందితుడి సహాయకుడితోపాటు మరో వ్యక్తి ఇళ్లను కూల్చివేశారు. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈనెల 3న కాన్పూర్‌లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళన కారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసు సిబ్బంది సహా 40 మందికి గాయాలయ్యాయి. పెట్రోల్‌బాంబులతో వాహనాలు, దుకాణాలను ధ్వంసం చేశారు. శుక్రవారం సహరాన్‌పూర్‌లో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టారు. స్థానిక అధికారుల సమక్షంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించి కూల్చివేశారు. సంఘ విద్రోహ శక్తులను అణిచివేసేందుకు అధికారులకు యోగి సర్కారు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
దిల్లీ, మహారాష్ట్రలో కేసులు:శుక్రవారం ఘటనపై దిల్లీ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. సెక్షన్188 కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ శ్వేతా చౌహాన్ తెలిపారు. శుక్రవారం ఆందోళనలు చోటు చేసుకున్న జామా మసీదు ప్రాంతంలో పోలీసు బలగాలను మోహరించారు. శుక్రవారం నిరసనలు ఎవరు చేశారో తెలియదన్న దిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ.. అల్లర్లకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో... డివిజనల్ కమిషనర్ కార్యాలయానికి సమీపంలో ఆందోళన చేసిన 100మందిపై.. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.