సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న రైతులు.. తమ పంట ఉత్పత్తులను పార్లమెంట్ భవనం వద్దే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ అన్నారు. జైపుర్లోని విద్యానగర్ స్టేడియంలో జరిగిన 'కిసాన్ మహాపంచాయత్'లో ప్రసంగించారాయన.
రైతులు తమ పంటల్ని అమ్మేందుకు పార్లమెంటుకు వెళతారన్న టికాయత్.. అవసరమైనప్పుడు దిల్లీకి వెళ్లేందుకు సంసిద్ధంగా ఉండాలని అక్కడి రైతు సంఘాలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలను ఉటంకించారు.
''మళ్లీ అవసరమైనప్పుడు దిల్లీకి వెళ్లేందుకు మీరు సిద్ధంగా ఉండాలి. మరోసారి బారికేడ్లకు ఎదురెళ్లాలి. రైతులు ఎక్కడైనా తమ పంటను అమ్ముకోవచ్చని ప్రధాని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలు, కలెక్టర్ కార్యాలయాలు, పార్లమెంట్ వద్ద పంట ఉత్పత్తులను అమ్మి దానిని నిజం చేస్తాం. పార్లమెంటును మించిన మండీ ఇంకోటి లేదు.''