కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా ఏప్రిల్ 1 నుంచి తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు. ఏప్రిల్ 10న కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేని 24గంటల పాటు బ్లాక్ చేయనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నేతలు బుధవారం సాయంత్రం వెల్లడించారు. సాగు చట్టాలను నిరసిస్తూ దిల్లీ సరిహద్దుల్లో నాలుగు నెలలకు పైగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలు మే నెల ప్రథమార్థంలో పార్లమెంట్ మార్చ్ చేపట్టాలని నిర్ణయించారు. అయితే, ఈ మార్చ్ ఏ రోజు నిర్వహించేది మాత్రం త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
పార్లమెంట్ మార్చ్‌లో రైతులతో పాటు కార్మికులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, బహుజనులు, నిరుద్యోగ యువత పాల్గొంటారని రైతు నేతలు తెలిపారు. పూర్తి శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటనలో తెలిపారు. ఈ మార్చ్‌లో పాల్గొనేందుకు నిరసనకారులంతా సింఘూ, టిక్రీ, ఘాజీపుర్ ప్రాంతాలకు వాహనాల్లో చేరుకుంటారని, అక్కడినుంచి పాదయాత్రగా బయల్దేరి వెళ్తారని పేర్కొన్నారు. ఈ చట్టాలను రద్దు చేసేదాకా పోరాటం ఆగదని నేతలు స్పష్టంచేశారు.