కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు వరుసగా నాలుగో రోజూ కొనసాగాయి. రాజధాని సరిహద్దుల్లో బైఠాయించిన రైతులు.. బురారీ మైదానానికి వెళ్తే చర్చలు జరుపుతామని కేంద్రం చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు. బహిరంగ జైలు లాంటి బురారీ మైదానానికి వెళ్లమని తేల్చి చెప్పారు. డిమాండ్లు నెరవేర్చే వరకూ ఆందోళనను విరమించబోమని, దిల్లీలోకి వెళ్లే ఐదు ప్రవేశ మార్గాలను ముట్టడిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. సింఘు, టిక్రీ, ఘాజీపుర్ సరిహద్దుల్లో రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు తెలిపారు.
వదొంతులు నమ్మొద్దు... వాస్తవాలు చూడండి
రైతుల ఆందోళన గురించి 'మన్‌కీ బాత్' వేదికగా మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వ్యవసాయ చట్టాల అమలుతో రైతులకు కొత్త హక్కులు, అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు. దీర్ఘకాలంగా ఉన్న రైతుల సమస్యలకు ఈ చట్టాలు పరిష్కారం చూపిస్తాయని మోదీ పేర్కొన్నారు. 'వదొంతులు నమ్మొద్దు వాస్తవాలు చూడండి' అని ప్రజలను కోరారు. వ్యవసాయ చట్టాలు రైతులకు ఆయుధాలని ప్రస్తావించారు. సరుకు అమ్మిన మూడు రోజుల్లోనే డబ్బుచేతికి వచ్చేలా ఈ చట్టంలో నిబంధనలు ఉన్నాయని గుర్తుచేశారు.
బురారీకి వెళ్తేనే...
రైతులంతా బురారీ మైదానానికి వేళ్తే.. వారి సమస్యలపై రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రుల బృందం సిద్ధంగా ఉందని హోంశాఖ స్పష్టం చేసింది.
ఈ ప్రతిపాదనపై దాదాపు 30 రైతు సంఘాలు సమావేశమై చర్చలు జరిపాయి. కేంద్ర హోంమంత్రి విధించిన షరతులతో కూడిన చర్చలు తమకు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పాయి. చర్చల కోసం ఇలాంటి షరతులు విధించి రైతులను అవమానపరుస్తున్నారని మండిపడ్డాయి. బురారీలోని నిరంకారీ మైదానాన్ని బహిరంగ జైలుగా అభివర్ణించాయి. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ జరిపే వరకూ ఆందోళనలు ఇలాగే కొనసాగుతాయని, నిరసనలు మరింత ఉద్ధృతమవుతాయని తెలిపాయి. ఆందోళనలో రాజకీయ పార్టీ నేతలకు ప్రసంగించే అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాయి.
రైతు సంఘాల నాయకుల స్పందన
" కేంద్రం చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం. షరతులు విధించి చర్చలు జరుపుతామని చెప్పి రైతులను అవమానించారు. దిల్లీలోకి వెళ్లే ఐదు ప్రవేశ మార్గాలను ముట్టడి చేస్తాం".
- సుర్జీత్ ఎస్ పుల్, పంజాబ్ భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు.