తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బెదురులేని అన్నదాత- ఉద్యమం మరింత ఉద్ధృతం - అన్నదాతల ఉద్యమానికి వంద రోజులు

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం శనివారంతో వంద రోజులకు చేరింది. ఈ సందర్భంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశారు అన్నదాతలు. హరియాణాలోని సోనీపత్​లో ఫెరిఫెరల్ ఎక్స్​ప్రెస్ వే దిగ్బంధించారు. ఉదయం 11 గంటలకు మొదలైన రహదారుల దిగ్బంధం.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.

protesting-farmers-block-expressway-in-haryana-as-agitation-completes-100-days-govt-ready-to-amend-agri-laws-says-tomar
బెదురులేని అన్నదాత- వంద రోజులకు ఉద్యమం

By

Published : Mar 6, 2021, 11:13 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించి 100 రోజులైన సందర్భంగా రైతులు తమ పోరును ఉద్ధృతం చేశారు. రహదారులపై నిరసనలకు దిగారు. రహదారుల దిగ్బంధానికి సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆందోళన కొనసాగించారు.

హరియాణాలో రహదారులపై రైతులు

హరియాణాలోని సోనీపత్​​లో ఆరు లైన్ల 'కుండ్లీ పశ్చిమ ఫెరిఫెరల్ ఎక్స్​ప్రెస్​ వే'ను దిగ్బంధించారు రైతులు. ఆ మార్గంలో వచ్చే వాహనాల నుంచి టోల్ రుసుం వసూలు చేయకుండా అడ్డుకున్నారు. సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్లపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారిపై డోలు వాయిస్తూ.. కేంద్రానికి తమ గోడును విన్నవించుకున్నారు.

హరియాణా: కుండ్లీ వద్ద రైతుల ఆందోళన

కొంత మంది రైతులు నల్ల జెండాలు, చేతి బ్యాండ్లు ధరించి ఆందోళనల్లో పాల్గొన్నారు. మహిళా రైతులు సైతం నల్ల దుపట్టాలతో నిరసన చేపట్టారు. చట్టాలను రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని కర్షకులు తేల్చి చెప్పారు. 'ఎక్స్​ప్రెస్ వే'పై ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రైతుల నిరసన సాయంత్రం నాలుగు గంటల వరకు సాగింది. రహదారుల దిగ్బంధంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సాయంత్రం 4 గంటలకు రహదారిని ఖాళీ చేస్తున్న రైతులు

భారీ ట్రాఫిక్ జామ్

షాజహాన్పు​ర్​లో రైతులు చేపట్టిన రాస్తారోకో వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బారోడ్ నుంచి హరియాణా సరిహద్దు దిశగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 10-15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు గంటల తరబడి ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది.

రాజస్థాన్​లోని అల్వార్​ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు

ప్రముఖ రైతు నాయకుడు రాకేశ్ టికాయిత్.. ముజఫర్​నగర్​లో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించారు.

ట్రాక్టర్ ర్యాలీలో రాకేశ్ టికాయిత్

రైతు సంఘాలన్నీ తమ డిమాండ్​పై వెనక్కి తగ్గలేదని నాయకులు తెలిపారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని అయితే వాటికి ఎలాంటి ముందస్తు నిబంధనలు ఉండకూడదని అన్నారు.

సాయంత్రం 4 గంటలకు రహదారిని ఖాళీ చేస్తున్న రైతులు

చర్చలకు రైతులు ఎప్పుడు 'నో' చెప్పలేదని రైతు నాయకుడు కుల్వంత్ సింగ్ సంధు తెలిపారు. చట్టాల రద్దు డిమాండ్​పై తొలి నుంచి అదే వైఖరితో ఉన్నామని స్పష్టం చేశారు. మార్చి 9న రైతు సంఘాల నేతలు సమావేశమై ఉద్యంలో తర్వాత చేపట్టే కార్యక్రమాలపై చర్చిస్తామని చెప్పారు.

టోల్ రుసుం లేకుండానే వాహనాలకు అనుమతి

సవరణకు సిద్ధం: తోమర్

కాగా.. మూడు సాగు చట్టాలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పునరుద్ఘాటించారు. ఉద్యమం చేస్తున్న రైతుల అభిప్రాయాలను గౌరవించి ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులను పెంచేందుకే ఈ మూడు చట్టాలను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ చట్టాల ద్వారా తమ ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించే స్వేచ్ఛ రైతులకు లభించిందని వివరించారు. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పణంగా పెట్టి ఈ విషయంపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రైతు సంఘాలతో పాటు విపక్ష పార్టీలు సైతం ఈ చట్టాల్లో లోపాలను గుర్తించలేకపోయాయని అన్నారు.

'భాజపా అహంకారానికి వంద రోజులు'

ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. దేశ ప్రజాస్వామ్యంలో ఈ వంద రోజుల నిరసనలు చీకటి అధ్యాయమని పేర్కొంది. భాజపా ప్రభుత్వ అహంకారానికి వంద రోజులు నిండాయని మండిపడింది. తమ డిమాండ్ల కోసం అన్నదాతలు పోరాడుతుంటే ప్రభుత్వం వారిని వేధిస్తోందని రాహుల్ ఆరోపించారు. రైతుల బిడ్డలు దేశ సరిహద్దుల్లో రక్షణగా ఉంటే.. ప్రభుత్వం వారిని అడ్డుకునేందుకు దిల్లీ సరిహద్దుల్లో మేకులు పాతిందని ధ్వజమెత్తారు. రైతుల పోరాటం రోజురోజుకు బలపడుతోందన్నారు.

రైతుల హక్కు పోరాటంతో పాటు భాజపా అహంకారానికి వంద రోజులు నిండాయని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. గాంధీ, పటేల్, నెహ్రూ, లాల్​ బహదుర్ శాస్త్రి, భగత్ సింగ్ చూపిన దారిలో రైతులు ఆందోళన చేస్తున్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details