పార్లమెంట్లో కొత్త సాగు చట్టాలను రద్దు(farm laws repealed ) చేసిన తర్వాతే ఆందోళనలు(Farmers protest) విరమిస్తామని, అప్పటి వరకు రైతుల నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్(Rakesh Tikait). పంటలకు కనీస మద్దతు ధర సహా ఇతర సమస్యలపై రైతులతో ప్రభుత్వం చర్చించాలని నొక్కి చెప్పారు.
గత ఏడాది తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు(farm laws repealed) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ప్రకటించిన కొద్దిసేపటికి ట్విట్టర్ వేదికగా ఈ విషయం వెల్లడించారు టికాయిత్.
" తక్షణమే ఆందోళనలు విరమించటం లేదు. పార్లమెంట్లో సాగు చట్టాలను రద్దు చేసే వరకు వేచి ఉంటాం. కనీస మద్దతు ధర సహా ఇతర అంశాలపై రైతులతో ప్రభుత్వం మాట్లాడాలి. ఇది రైతుల విజయం. ఆందోళనల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులు, గిరిజనలు, కార్మికులు, మహిళలకు ఈ విజయం అంకితం. "
- రాకేశ్ టికాయిత్, బీకేయూ నేత
ఎన్నికల గిమ్మిక్కే..
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఎన్నికల గిమ్మిక్కేనన్నారు రాకేశ్ టికాయిత్(Rakesh tikait). మోదీ సర్కారు గ్రాఫ్ పడిపోతున్న తీరు, వారి ఇమేజ్ దెబ్బతింటున్న తీరును గమనిస్తే స్పష్టమవుతుందన్నారు. కార్పొరేట్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి, సొంత లాభం కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు.
స్వాగతించిన ఎస్కేఎం..
మరోవైపు... సాగు చట్టాలను రద్దు(Farm laws repealed) చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించటాన్ని స్వాగతించింది సంయుక్త కిసాన్ మోర్చా(Samyukt Kisan Morcha). తాజా పరిస్థితులపై రైతు నేతలతో సమావేశమై, విస్తృత చర్చల అనంతరం తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపింది. పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చట్టాల రద్దు కోసం ఎదురుచూస్తామని పేర్కొంది. సాగు చట్టాలను(Farm laws) అధికారికంగా రద్దు చేస్తే.. అది ఏడాది కాలంగా పోరాటం చేస్తున్న రైతులకు చారిత్రక విజయమవుతుందని తెలిపింది. చట్టాల రద్దు ఒక్కటే కాదని, పంటలకు చట్టబద్ధంగా కనీస మద్దతు ధర కల్పించటమూ రైతుల ప్రధాన డిమాండ్‌గా పేర్కొంది. ఎంఎస్పీ, విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించుకోవటం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్లు గుర్తు చేసింది.
గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. వ్యవసాయ చట్టాలను రద్దు(Farm laws repealed) చేస్తున్నట్లు ప్రకటించారు. సాగు చట్టాలు రైతుల ప్రయోజనాల కోసమేనని, తాము ఎంత ప్రయత్నించినా రైతులలో ఓ వర్గాన్ని ఒప్పించలేకపోయమన్నారు. ఈ చట్టాల లక్ష్యం రైతులను, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులను బలోపేతం చేసేందుకే తీసుకొచ్చినట్లు పునరుద్ఘాటించారు.
ఇదీ చూడండి:కొత్త సాగు చట్టాలను రద్దు.. రైతులకు మోదీ క్షమాపణలు