తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరెంట్ కోతలపై నిరసన.. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మృతి! - బిహార్ పోలీసుల కాల్పులు

విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన హింసకు దారితీసింది. నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు చెబుతున్నారు. బిహార్ కటిహార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అయితే, పోలీసులు మాత్రం ఒకరే చనిపోయారని అంటున్నారు.

police-firing-on protesters-katihar bihar
police-firing-on protesters-katihar bihar

By

Published : Jul 26, 2023, 3:57 PM IST

Updated : Jul 26, 2023, 9:41 PM IST

కరెంట్ కోతలపై నిరసన

విద్యుత్ సరఫరా సమస్యలపై ఆందోళన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారని స్థానికులు చెబుతున్నారు. బిహార్ కటిహార్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. అయితే, పోలీసులు మాత్రం ఒకరే చనిపోయారని అంటున్నారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
జిల్లాలోని బర్సోయి ప్రాంత ఎస్​డీఓ కార్యాలయం వద్ద ఈ ఘర్షణ తలెత్తింది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. కొందరు ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో ఘర్షణ మొదలైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని స్థానికుల సమాచారం. అయితే, పోలీసులు మాత్రం ఒక మృతినే నిర్ధరించారు.

ఏఎస్ఐ అరెస్ట్..
కాల్పులకు కారణమైన పోలీసులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఏఎస్ఐని అరెస్ట్ చేశారు. ముగ్గురు మృతుల్లో ఒకరిని బాసల్ గ్రామానికి చెందిన ఖుర్షిద్ ఆలం(34)గా గుర్తించించినట్లు పోలీసులు తెలిపారు. మరో మృతుడిని నియాజ్ ఆలం(32)గా స్థానికులు చెబుతున్నారు. ఇంకొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

స్థానికుల సమాచారం ప్రకారం ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నందున విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు సమాచారం. దీంతో కోపంతో స్థానికులు బస్తౌల్ చౌక్ వద్ద ఆందోళన చేశారు. ప్రధాన రహదారిని దిగ్బంధించారు. విద్యుత్ అధికారుల కార్యాలయంలోకి వెళ్లి స్థానికులు విధ్వంసం సృష్టించారు. ఆఫీసు అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. వారిని అదుపు చేసేందుకు పోలీసులు జరపడం వల్ల స్థానికంగా వాతావరణం వేడెక్కింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

అయితే, తాము శాంతియుతంగానే నిరసన చేసినట్లు స్థానికులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అధికారులకు వ్యతిరేకంగా నిరసనకు దిగినట్లు చెప్పారు. ఆ సమయంలోనే పోలీసులు కాల్పులు జరిపారని నిరసనకారులు తెలిపారు. ఐదుగురికి బులెట్ గాయాలయ్యాయని, అందులో ముగ్గురు చనిపోయారని చెప్పారు. పోలీసుల లాఠీఛార్జ్​లో చాలా మందికి గాయాలయ్యాయని వివరించారు.

ప్రియుడితో ఏకాంతం కోసం ఊరికి కరెంట్ కట్..
ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ యువతి తన ప్రియుడిని ఏకాంతంగా కలుసుకునేందుకు గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తూ దొరికిపోయింది. ఆ యువతి.. ప్రతి రోజు రాత్రి ట్రాన్స్​ఫార్మర్​ వద్దకు వెళ్లి విద్యుత్​ సరఫరాను నిలిపివేసేది. అనంతరం ప్రియుడితో ప్రేమలో మునిగిపోయేది. అనుమానం వచ్చిన గ్రామస్థులు ఆరా తీసి.. ప్రేమికులను ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Last Updated : Jul 26, 2023, 9:41 PM IST

ABOUT THE AUTHOR

...view details