కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న పరిస్థితుల్లోనూ సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కరోనా సోకకుండా జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. "సింఘు సరిహద్దులో ఇప్పటివరకు పెద్దగా కరోనా వైరస్ కేసులు లేవు. రైతులు 'కాడా(మూలికలు, వివిధ మసాలాలతో తయారు చేసిన రసం)', నిమ్మకాయ నీళ్లు, విటమిన్ మాత్రలు వాడుతున్నారు. ఆందోళన పడాల్సిన అవసరమే లేదు" అని సుఖ్వీందర్ అనే రైతు తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారంతో తాము కరోనాను జయిస్తున్నామని ఆయన అన్నారు.
కరోనా వేళ దిల్లీ సరిహద్దుల్లో రైతుల స్వయం సంరక్షణ!
దేశంలో రెండోదశ కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలోనూ.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో పోరాటం చేస్తున్న అన్నదాతల ఆందోళన ఆగడం లేదు. మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు సహజ ఔషధాలను వాడటం సహా.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ తాము వైరస్ను జయిస్తున్నామని చెబుతున్నారు.
తాము ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో టీకా కేంద్రాలు తెరవాలని కొందరు రైతులు డిమాండ్ చేస్తున్నారు. "టిక్రీ సరిహద్దు వద్ద వ్యాక్సినేషన్ కేంద్రం పెట్టాలని డిమాండ్ చేశాం. ఇప్పటివరకు అధికారులు స్పందించలేదు" అని ఓ రైతు చెప్పారు. మరోవైపు కొవిడ్ మహమ్మారిపై పోరులో రైతులూ భాగస్వాములవుతున్నారు. ఆక్సిజన్ లంగర్లు ప్రారంభించామని, ఇందులోంచి.. కొవిడ్ రోగులకు సిలిండర్లు అందిస్తున్నామని రైతు నాయకుడు ధర్మేంద్ర మాలిక్ తెలిపారు.
ఇదీ చదవండి:స్వాతంత్ర్య సమర యోధుడు లల్తీరామ్ కన్నుమూత