Nupur Sharma controversy: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల కేసులో భాజపా మాజీ నేత నుపుర్ శర్మపై ఆగస్టు 10 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. తనకు ప్రాణహాని ఉందన్న నుపుర్ శర్మ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం.. ఆమెకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. భవిష్యత్తులో నమోదయ్యే కేసుల విషయంలోనూ ఈ తీర్పు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తనపై నమోదైన కేసులన్నింటినీ ఒకే కోర్టుకు మార్చాలన్న నుపుర్‌శర్మ విజ్ఞప్తిపై.. కేంద్ర ప్రభుత్వం, దిల్లీ, బంగాల్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 10 లోగా ప్రతిస్పందన తెలియజేయాలని ఆదేశించింది. అనంతరం విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. గత నెల ఇదే ధర్మాసనం నుపుర్‌శర్మపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది.
నుపుర్ హత్యకు పాక్ నుంచి వచ్చి..
మరోవైపు, నుపుర్ శర్మను హత్య చేసేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించాడు. అతడిని భద్రతా దళాలు రాజస్థాన్‌లోని శ్రీగంగా నగర్ జిల్లాలో అరెస్టు చేశాయి. జులై 16న రాత్రి 11 గంటలకు పాక్ జాతీయుడిని అదుపులోకి తీసుకున్నట్లు బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి తెలిపారు. అనంతరం పోలీసులకు అప్పగించినట్లు స్పష్టం చేశారు.
'హిందూమాల్కోట్ సరిహద్దు అవుట్‌పోస్ట్ వద్ద నిందితుడిని గుర్తించాం. గస్తీ కాస్తున్న బృందాలకు అతడు అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నాం. అతడి వద్ద నుంచి రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నాం. అందులో ఒకటి 11 అంగుళాల పొడవు ఉంది. దీంతో పాటు బ్యాగులో ఇసుక, మతపరమైన పుస్తకాలు, దుస్తులు, ఆహారం, దువ్వెన, హెయిర్ ఆయిల్ లభించాయి. నిందితుడు తన పేరు రిజ్వాన్ అష్రఫ్ అని చెప్పాడు. పాకిస్థాన్, పంజాబ్ రాష్ట్రంలోని మండీ బహౌద్దీన్ పట్టణం నుంచి వచ్చినట్లు తెలిపాడు. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను హత్య చేసేందుకు సరిహద్దు దాటి వచ్చినట్లు ప్రాథమిక విచారణలో చెప్పాడు. ప్లాన్ అమలు చేసే ముందు అజ్మీర్ దర్గాను సందర్శించాలని నిందితుడు భావించాడు. అతడిని స్థానిక పోలీసులకు అప్పగించాం. మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా.. ఎనిమిది రోజుల పోలీసు కస్టడీ లభించింది. సంబంధిత ఏజెన్సీలకు సమాచారం చేరవేశాం. ఐబీ, రా, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అతడిని ప్రశ్నిస్తున్నాయి' అని బీఎస్ఎఫ్ అధికారి వివరించారు.
ఇదీ చదవండి: