కొవిడ్ టీకాపై అపోహలు వద్దు.. ఆందోళనా చెందొద్దు.. తప్పుడు ప్రచారం కరోనా వైరస్ కన్నా ప్రమాదకరం.. అంటూ హితవు చెప్తున్నారు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి జె.వి.ఆర్.ప్రసాదరావు. ప్రాణాంతక కొవిడ్‌ను ఎదుర్కోవడంలో టీకానే ప్రధానాస్త్రంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. టీకా సమర్థత, సురక్షితత్వంపై కేంద్ర ప్రభుత్వం, ఔషధ నియంత్రణ సంస్థ, శాస్త్రవేత్తలు అన్ని విధాలా పరిశీలించి, జాగ్రత్తలు తీసుకున్నాకే అనుమతులు ఇచ్చారన్నారు. టీకాల కారణంగా తీవ్ర దుష్ఫలితాలు కలగడం అరుదని తెలిపారు. టీకాల కారణంగా స్వల్పసంఖ్యలో ఇటీవల చోటుచేసుకున్న మరణాలు యాదృచ్ఛిక ఘటనలేనని వైద్యులు ప్రాథమికంగా నిర్ధరించటాన్ని ఆయన ప్రస్తావించారు. తొలివిడతలో 30కోట్ల మంది భారతీయులకు టీకాలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందనీ, ప్రపంచంలోనే ఇది అతి భారీ కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. టీకాను పొందడం సామాజిక బాధ్యతనీ, దీన్ని విజయవంతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. టీకాలపై అపోహలు, అమలు తీరు, ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయటం.. తదితర అంశాలపై డాక్టర్ ప్రసాదరావుతో 'ఈనాడు' ప్రత్యేక ముఖాముఖి.
టీకాల పంపిణీ ప్రారంభమై పది రోజులు గడిచినా.. ఇంకా వైద్యసిబ్బందిలోనే పూర్తిస్థాయి స్పందన లేదు. టీకాలపై అపోహలు, భయాలు వెన్నాడుతున్నాయి. దీన్నెలా చూస్తారు?
కొవిడ్‌పై పోరులో వైద్యసిబ్బంది ఎనలేని కృషి చేస్తోంది. అందుకే వారికి ముందుగా టీకాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని రాష్ట్రాల్లో టీకాలు తీసుకోడానికి బాగానే ముందుకొస్తున్నా.. మరికొన్నిచోట్ల అంతగా స్పందన లేదు. కారణం.. రకరకాల దుష్ప్రచారం. చిన్నారులకు టీకాలిచ్చేటప్పుడు ఎలాంటి స్వల్ప దుష్ఫలితాలు కనిపిస్తాయో.. కొవిడ్ టీకాకూ అంతే. కొవిడ్ వల్ల కలిగే తీవ్ర నష్టంతో పోల్చితే.. టీకా తీసుకోవడం వల్ల ఎదురయ్యే స్వల్ప అస్వస్థతలను భూతద్దంలో చూడటం సరికాదు. టీకా వేయించుకోవడం స్వచ్ఛందమే అయినా.. సామాజిక బాధ్యతగా అందరూ ముందుకు రావాలి. ముందుగా టీకాలు తీసుకుంటూ వైద్యసిబ్బంది అందించే స్ఫూర్తిని ఇతర వర్గాలు అందిపుచ్చుకోవాలి.
30కోట్ల మందికి టీకాలందించడానికి ఎలాంటి కార్యాచరణ అవసరం?
దీనిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖకు పలు సూచనలు ఇచ్చాను. ప్రస్తుతం వైద్యసిబ్బందికి.. తర్వాత పోలీసు, రెవెన్యూ, పురపాలక సిబ్బందికి ఇవ్వడానికి కనీసం మరో 2, 3 నెలలైనా పడుతుంది. ఈలోగా మిగిలిన 27 కోట్ల మందికి టీకా పంపిణీ సన్నాహాలకు సమయం లభిస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా నిల్వలకు సరిపడేలా అతిశీతల పరికరాలను సమకూర్చుకోవాలి. లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి.. టీకాలిచ్చే సిబ్బందినీ అదనంగా నియమించుకోవాలి. ఇంత భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం సవాలే. కానీ, అసాధ్యమేమీ కాదు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారందరికీ ఒకేసారి కాకుండా.. దశల వారీగానూ ఇవ్వచ్చు. ఉదాహరణకు 80 ఏళ్లు పైబడినవారికి ముందు.. 70-80 ఏళ్ల వారికి తర్వాత.. 50-70 ఏళ్ల వారికి ఆ తర్వాత.. ఇలా విభజించుకొని టీకాలు ఇవ్వడాన్ని ప్రణాళికబద్ధం చేసుకోవాలి. దీనివల్ల ఒకేసారి ఎక్కువ రద్దీ తలెత్తదు. పంపిణీ సాఫీగా సాగిపోతుంది.
టీకా తీసుకున్నాక కొందరు మృతిచెందిన సంఘటనలు ఎదురయ్యాయి. ఈ విషయంలో కొన్ని భయాందోళనలున్నాయి. దీనిపై ఏమంటారు..?
ఇవి యాదృచ్ఛికంగా చోటుచేసుకున్న మరణాలే తప్ప.. వాటికి టీకా కారణం కాదని వైద్యనిపుణులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల్లో అప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలున్నట్లుగా వారు గుర్తించారు. టీకా తీసుకునే సమయంలో ఆ అనారోగ్యం తీవ్రమై మృతికి దారితీసిందనేది ప్రాథమిక విశ్లేషణ. అయినా ఈ తరహా మరణాలపై వైద్యనిపుణులు లోతుగా విశ్లేషిస్తున్నారు. ప్రజలు భయాందోళనలకు గురికాకూడదనే వైద్యరంగంలో నిష్ణాతులు ముందుకొచ్చి టీకాలు పొందుతున్నారు. టీకాల వల్ల స్వల్ప అస్వస్థత మినహా ఇప్పటి వరకూ ఒక్క తీవ్ర అనారోగ్యం కూడా ఎదురవలేదు. అనవసర భయాందోళనలు వీడి, టీకాలు పొందడానికి చొరవ చూపాలి. ప్రభుత్వం సైతం అపోహలు, అనుమానాల నివృత్తికి పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలి.
అపోహలు తొలగిస్తూ టీకాను ప్రజల్లోకి తీసుకెళ్లడమెలా?