Period Stains in Bedsheet: రక్తం మరకలు ప్రతి మహిళ జీవితంలోనూ భాగమే. నెలసరి ప్రారంభమైనప్పటి నుంచి మెనోపాజ్ దశ చేరేవరకు కనీసం ఒక్కసారైనా రక్తం మరకలు దుస్తులకు అంటనివారుండరంటే అతిశయోక్తి కాదేమో! ఈ పీరియడ్స్ (రుతుచక్రం) అనేది మహిళ శరీరంలో జరిగే ఒక సాధారణమైన ప్రక్రియే. వీటి గురించి మహిళలు బహిరంగంగా మాట్లాడటం ఇటీవలి కాలంలో పెరిగింది. కేంద్రం, ఎన్జీఓల అవగాహన కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైంది. ఇలాంటి తరుణంలో బంగాల్ పశ్చిమ మెదినీపుర్లోని ఓ హోటల్ యాజమాన్యం.. మహిళ పట్ల ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఉన్న గదిలో బెడ్‌షీట్‌పై పీరియడ్స్‌కు సంబంధించి రక్తపు మరకలు ఉన్నాయని అదనంగా డబ్బులు వసూలుచేశారు హోటల్ సిబ్బంది.
కోల్‌కతాలోని ఓ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసే మహిళ ఆదివారం రాత్రి తన అంకుల్‌తో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఓ యాప్ ద్వారా.. హోటల్లో రూం బుక్ చేసుకున్నారు. సోమవారం ఉదయం గది ఖాళీ చేసి వెళ్తుండగా.. బిల్లు చూసి షాకయ్యారు. అదనంగా రూ. 400 ఎక్కువ అడగటం చూసి.. వారిని ప్రశ్నించగా వివాదం మొదలైంది.
''నేను హోటల్‌ను ఖాళీ చేసి వెళ్తున్న సమయంలో బిల్లు ఇచ్చారు. లాండ్రీ సెక్టార్ రూ. 400 అదనంగా వేయడం చూసి షాకయ్యా. బెడ్‌షీట్‌పై రుతుస్రావానికి సంబంధించి రక్తపు మరకలు ఉన్నాయని చెప్పారు. 'వాటిని ఉతకలేం, పడేయలేం.. అందుకే అదనంగా ఛార్జి చేస్తున్నాం' అన్నారు. ఒకవేళ బెడ్‌షీట్‌పై టొమాటో కెచప్ లేదా ఇంకేదైనా పడితే నానుంచి ఇలాగే అదనంగా డబ్బు వసూలు చేసేవారా? అస్వస్థతతో బెడ్‌పై వాంతులు చేసుకుంటే.. ఇలాగే చేస్తారా? అని ప్రశ్నించా.''
- బాధిత మహిళ