'ఆక్సిజన్ డ్రిల్' పేరుతో కొవిడ్ రోగుల ప్రాణాలతో ఆడుకుంది ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలోని ఓ ఆసుపత్రి. సరఫరాను నిలిపివేసి.. ఆక్సిజన్ కొరత ఉందని ఐదు నిమిషాల పాటు ఈ డ్రిల్ చేసింది. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి 22 మంది చనిపోయారని తెలుస్తోంది. ఏప్రిల్ 26న జరిగిన ఈ ప్రణాళిక గురించి ఆసుపత్రి యజమాని వివరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది
ఆగ్రాలోని పరాస్ ఆసుపత్రికి డా. అరింజయ్ జైన్ యజమాని. కరోనా కారణంగా గత ఏప్రిల్ నెలలో ఆసుపత్రికి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. తగిన ఏర్పాట్లు చేయాల్సింది పోయి.. 'మాక్ డ్రిల్' తరహాలో 'ఆక్సిజన్ డ్రిల్' నిర్వహించారు సిబ్బంది. ఆక్సిజన్ సరఫరాను అర్ధంతరంగా నిలిపివేశారు.
"ఆ సమయంలో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉంది. మోదీనగర్‌లో అసలు ఆక్సిజనే లేదు. 96మంది రోగులు ఉన్నారు. వారిని తీసుకెళ్లిపోవాలని వారి బంధువులను కోరాము. కానీ వారు నా మాట వినలేదు. అందుకే నేను ఓ మాక్ డ్రిల్ చేయాలనుకున్నా. ఏప్రిల్ 26, ఉదయం 7 గంటలకు.. ఐదు నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరాను నిలిపివేశాము. ప్రాణవాయువు అందక 22మంది విలవిలలాడిపోయారు. వారి శరీరాల రంగులు కూడా మారిపోయాయి. ఆక్సిజన్ లేకపోతే వారు బతకరని అర్థమైంది. ఐసీయూలోని మిగిలిన 74మంది రోగుల కుటుంబాలకు.. సొంతంగా ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకోవాలని ఆదేశించాము."
--- డా. అరింజయ్ జైన్
ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 22మంది పరిస్థితి విషమించింది. ఆ 22 మంది మృతి చెందారనే ప్రచారం వ్యాప్తిలోకి వచ్చింది. పరాస్ ఆసుపత్రిలో ఏప్రిల్ 26న తన తాత చనిపోయారని ఆగ్రాలోని జీవన్ మండి ప్రాంత నివాసి మయాంక్ చావ్లా వెల్లడించారు. అదే రోజు ఎందరో ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.