కర్ణాటకలో మరాఠా అభివృద్ధి ప్రాధికార (డెవలప్మెంట్ కార్పొరేషన్) సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలో బంద్ చేపట్టాయి కన్నడ అనుకూల సంఘాలు. బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగాయి. ప్రభుత్వ నిర్ణయం కన్నడ ఐక్యతకు గొడ్డలిపెట్టు లాంటిదని కర్ణాటక రక్షణ వేదిక, కన్నడ చలువళి, కన్నడ ఒక్కూటా వంటి సంఘాలు మండిపడ్డాయి.
బెంగళూరు టౌన్‌హాల్ వద్ద పెద్ద సంఖ్యలో కన్నడీగులు చేరి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకోగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు పోలీసులు. అలాగే.. చామరాజనగర్, బెంగళూరు రూరల్, గదగ్, కొప్పా, హస్సాన్, రామనగర్, చిత్రదుర్గా, దవాంజెర్, బగల్కోట్, చిక్కమగలూరు, మాండ్య సహా ఇతర జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. కన్నడ ఆర్గనైజేషన్స్లోని భాగస్వామ్య సంస్థలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం సాయంత్రం బెంగళూరులోని టౌన్ హాల్ నుంచి ప్రీడమ్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాయి.
ఈ క్రమంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు పోలీసులు. బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో బలగాలను మోహరించారు.