కరోనా రెండో ఉద్ధృతి(Corona second wave) సమయంలో దేశంలో ఎలాంటి దుర్భర పరిస్థితులు తలెత్తాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. లక్షల కొద్ది కేసులు, శవాల గుట్టలు, ఆక్సిజన్ కొరతతో(Oxygen shortage in India) ప్రజలు బెంబేలెత్తిపోయారు. అయితే.. ఆక్సిజన్ కొరత కారణంగా కొవిడ్(Covid-19) బాధితులెవరూ మృతి చెందలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రకటించింది. ఇలాంటి మరణాలు సంభవించినట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతలేవీ నివేదించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఆక్సిజన్ కొరతతో ఒక్కరు కూడా మృతి చెందలేదని ప్రకటించటంపై రాజకీయ దుమారం చెలరేగింది. దీంతో కేంద్రం తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి.
కేంద్రం వల్లే మరణాలు..
ఆక్సిజన్ కొరతతో ఒక్క మరణం సంభవించలేదని ప్రకటించటంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కరోనా సమయంలో 700 శాతం మేర ఆక్సిజన్ ఎగమతులను పెంచటం, దేశీయంగా ప్రాణవాయువు సరఫరాకు ట్యాంకులను అందుబాటులో ఉంచకపోవటం వల్లే మరణాలు సంభవించాయన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. అలాగే.. నిపుణుల బృందం, పార్లమెంటరీ కమిటీల సలహాలను విస్మరించి, ఆక్సిజన్ అందించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవటమూ ఓ కారణమని ఆరోపించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు చేపట్టినట్లు కనిపించలేదన్నారు.
తప్పుడు సమాచారంతో పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించడం కోసమే ఇలా చేసినట్లు కాంగ్రెస్ పేర్కొంది.
పాలసీ మార్పుతో విపత్కర పరిస్థితులు: సిసోడియా
కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరత వల్ల నమోదైన మరణాలపై దర్యాప్తునకు కేంద్రం అనుమతిస్తే తమ ప్రభుత్వం ప్రత్యేక ప్యానల్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. కేంద్రం తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఏప్రిల్ 13 తర్వాత ఆక్సిజన్ పంపిణీ పాలసీని మార్చటం, సరైన నిర్వహణ లేకపోవటం వల్ల ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతకు కారణమైందని, దాంతోనే విపత్కర పరిస్థితులు తలెత్తాయన్నారు. మరణాలపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతించటం లేదని ఆరోపించారు.