ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (UP Election 2022) ప్రియాంకా గాంధీ నుంచి తమకు ఎలాంటి ప్రమాదం లేదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, భాజపా నేత కేశవ్ ప్రసాద్ మౌర్య (Keshav Prasad Maurya news) అన్నారు. ప్రియాంకను 'ట్విట్టర్ వాద్రా'గా (Priyanka Twitter Vadra) అభివర్ణిస్తూ ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఏడు స్థానాలను నిలబెట్టుకుంటే గొప్పే (Congress in UP) అని అన్నారు. ఈ మేరకు పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. కాంగ్రెస్ 40 శాతం టికెట్లను మహిళలకు కేటాయించడంపైనా పెదవి విరిచారు.
"ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్ ఉనికి అసలే లేదు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ రెండు సీట్లలో గెలిచారు. 2019 లోక్సభలో అది ఒకటికే పరిమితమైంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడు సీట్లే సాధించింది. 2022లో ఈ సీట్లు నిలబెట్టుకుంటే.. కాంగ్రెస్కు అదే గొప్ప ఘనత అవుతుంది. ప్రియాంకను మీరే (మీడియాని ఉద్దేశించి) విపక్ష అభ్యర్థిగా చూస్తున్నారు. నేనైతే ప్రియాంకను ట్విట్టర్ వాద్రా (Priyanka Twitter Vadra) అని భావిస్తా. ఫొటోలు దిగే నేతలు తప్ప.. కాంగ్రెస్లో ఎవరూ లేరు. ప్రియాంక అయినా, రాహుల్ అయినా అంతే."
-కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ ఉపముఖ్యమంత్రి
సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు (SP BSP news) కూడా భాజపా విజయానికి అడ్డుకాదని మౌర్య ధీమాగా చెప్పారు. 2017 ఎన్నికల్లో గెలిచిన స్థానాలను మళ్లీ సాధిస్తే.. వారు సంతోషించవచ్చని అన్నారు. ఈ పార్టీలు చేసిన అవినీతి, నేరాలు, మాఫియా రాజకీయాల గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పార్టీలకు యూపీ ఎన్నికల్లో ప్రాధాన్యమే లేదని చెప్పుకొచ్చారు. ఈ పార్టీలు ఓట్లను చీల్చేందుకే పోటీ చేస్తున్నాయన్నారు.