దిల్లీ నుంచి గల్లీ వరకు ఎన్నికలేవైనా కాంగ్రెస్కు మాత్రం పరాజయమే ఎదురవుతోంది. మొన్న బిహార్, నిన్న జీహెచ్ఎంసీ ఇలా వరుస ఓటములు అటు పార్టీ నేతల్ని, ఇటు కార్యకర్తల్ని తీవ్ర నిరాశలో పడేశాయి. ఈ పరిస్థితిని మార్చి... అతి కీలకమైన 2022 ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు శ్రేణుల్ని సిద్ధం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర్ప్రదేశ్ బాధ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రాను రంగంలోకి దింపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు ప్రియాంక కూడా ప్రణాళికలు రచిస్తున్నారు.
యూపీలోనే..
ఇందుకోసం ఫిబ్రవరిలో ప్రియాంక లఖ్నవూలో పర్యటించనున్నారు. వీలైనంత సమయం యూపీలోనే ఆమె గడుపుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కమిటీలను ఏర్పాటు చేసి పంచాయతీ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని ఆమె రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులతో వర్చువల్గా జరిగిన సమావేశంలో ప్రియాంక చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే వివిధ స్థాయిల్లో పరిశీలకులను ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడు ఆకస్మిక పర్యటనలు చేస్తానని ప్రియాంక చెప్పారట.