Priyanka Gandhi UP Election 2022: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యూపీ సీఎం అభ్యర్థి తానేనంటూ బిగ్ హింట్ ఇచ్చిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఆ అభ్యర్థిని తాను కాదంటూ తన మాటల్ని ఉపసంహరించుకున్నారు.
'కాంగ్రెస్ తరఫున నేను యూపీ సీఎం అభ్యర్థినని చెప్పలేదు. మీరు పదేపదే అదే ప్రశ్న అడగుతుండంతో.. చిరాకుగా అనిపించింది. అందుకే అన్ని చోట్లా నేనే కనిపిస్తున్నాగా అన్నాను' అంటూ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చెప్పారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేయడం గురించి మాట్లాడుతూ..'దాని గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీకు వెల్లడిస్తాను' అని చెప్పారు.
Priyanka Gandhi news: మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయడం ఇద్దరికీ ఇదే తొలిసారి. ఈ క్రమంలో శుక్రవారం ప్రియాంక విలేకర్లతో మాట్లాడుతూ యూపీలో కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నపై స్పందించారు. ‘నేను కాకుండా ఇంకెవరైనా కనిపిస్తున్నారా? మరి ఇంకేంటి? రాష్ట్రంలో ఎక్కడచూసినా నేనే కనిపిస్తున్నానుగా’ అంటూ సమాధానమిచ్చారు. దాంతో అభ్యర్థిగా ఆమె పేరు ఖరారైనట్లు విశ్లేషణలు వెలువడ్డాయి.
బీఎస్పీ ప్రచారం ఆశ్చర్యం..
యూపీ ఎన్నికల్లో బీఎస్పీ ప్రచారం పట్ల కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నా.. బీఎస్పీ అధినేత్రి మాయావతి తక్కువ స్థాయిలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం ఒత్తిడి కూడా ఓ కారణం అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.