Priyanka Gandhi On Privatisation: ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా భాజపా ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రైవేటీకరణ అనేది రిజర్వేషన్లను అంతం చేయడానికి కేంద్రం ఎంచుకున్న మార్గమని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ పర్యటనలో భాగంగా నిర్వహించిన మహిళా శక్తి ప్రచార కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల సమస్యలను కాంగ్రెస్ మాత్రమే పట్టించుకుందని.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించడం మహిళా సాధికారతకు నిదర్శనమని చెప్పారు.
"ప్రభుత్వ సంస్థలను పలువురు పారిశ్రామిక వేత్తలకు ప్రధాని మోదీ అమ్మేశారు. ఇక ప్రైవేట్ సంస్థకు రిజర్వేషన్ వర్తిస్తుందా?. ఇది రిజర్వేషన్లను అంతం చేసే మార్గం. ఇలాంటి చర్యలు దేశానికి మేలు చేయవు. హక్కుల కోసం అడిగితే దాడులు చేస్తున్నారు. మహిళల హక్కులను కాలరాస్తున్నారు. మహిళా శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నారు."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
గ్యాస్ సిలిండర్‌తో బాధ్యత ముగుస్తుందా..?
ఓ గ్యాస్ సిలిండర్ ఇచ్చి మహిళల పట్ల తమ బాధ్యత తీరినట్లు ప్రభుత్వం భావిస్తోందని.. కానీ ఆ గ్యాస్ సిలిండర్‌ని మళ్లీ నింపించుకోనే దిశగా మహిళలను బలోపేతం చేయట్లేదని విమర్శించారు. పథకాలు ప్రకటిస్తున్నారు.. కానీ వాటిని అమలు చేయట్లేదని ఆరోపించారు. మహిళల సాధికారత, ఆరోగ్యం, విద్యపై నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ మాత్రమే పనిచేస్తుందని అన్నారు.
Attack On Girl In Amethi: అమేఠీలో దళిత బాలికపై దాడి అంశంపై అధికార భాజపాను విమర్శించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. ఈ కేసులో దోషులను వీలైనంత త్వరగా అరెస్టు చేయకపోతే నిరసన చేపడతామని హెచ్చరించారు. ఘటనకు సంబంధించిన వీడియోను ట్యాగ్ చేసి 'ఈ అమానవీయ చర్యకు పాల్పడిన నేరస్థులను 24 గంటల్లో అరెస్టు చేయకపోతే తీవ్ర ఆందోళన చేపడుతాం' అని ట్వీట్ చేశారు.