Priyanka Gandhi On Bjp : మధ్యప్రదేశ్‌లోని బీజేపీ సర్కారు ప్రతి నెలా ఒక కొత్త కుంభకోణానికి పాల్పడుతోందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. రాష్ట్రంలో మూడేళ్ల బీజేపీ పాలనలో.. 21 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు బీజేపీ 220 నెలలు పాలించిందని.. ఆ సమయంలో 225 కుంభకోణాలు చేసిందని విమర్శించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఎద్దేవా చేశారు. 2023 చివర్లో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ.. కాంగ్రెస్ తరఫున జబల్పుర్లో సోమవారం ప్రచారం ప్రారంభించారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ ఎన్నికల సమయంలో 'డబుల్ ఇంజిన్ సర్కార్' అని పదేపదే ప్రస్తావిస్తుంది. మధ్యప్రదేశ్‌లో కూడా అదే నినాదాన్ని ఇస్తుంది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కూడా బీజేపీ.. డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఎన్నికల ప్రచారం చేసింది. అయితే అక్కడి ప్రజలు.. మాటలు ఆపి పని ప్రారంభించాలని కమలం పార్టీకి బుద్ధి చెప్పారు. బీజేపీని కాదని.. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. రాష్ట్రంలో 220 నెలల భారతీయ జనతా పార్టీ పాలనలో 225 కుంభకోణాలు జరిగాయి. గత మూడేళ్లలో 21 మందికి మాత్రమే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని నా దృష్టికి వచ్చింది. నా కార్యాలయంలోని అధికారులతో కూర్చొని తనిఖీ చేయగా నిజమని తేలింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం దేవుళ్లను కూడా విడిచిపెట్టలేదు. మహాకాల్‌లో భారీగా డబ్బులు ఖర్చు పెట్టి నిర్మించిన మహాకాల్ లోక్ విగ్రహాలు గాలికి కూలిపోయాయి.
-- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ
Congress Five Promises In Madhya Pradesh : మరోవైపు మధ్యప్రదేశ్ ఓటర్లపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హామీల వర్షం కురిపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు నెల రూ.1,500 ఆర్థిక భరోసా, గ్యాస్ సిలిండర్ రూ.500కు అందిస్తామని ప్రియాంక తెలిపారు. 100 యూనిట్ల ఉచిత విద్యుత్, పాత పెన్షన్ విధానం పునురుద్ధరణ, రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రియాంక గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో పాత పెన్షన్ విధానాన్ని పునురుద్ధరించిందని పేర్కొన్నారు.
సెంటిమెంట్లు, భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుందని.. ప్రజా సమస్యలను ఎప్పుడూ పరిష్కరించలేదని ప్రియాంక గాంధీ ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి బీజేపీ ఏమి చేసిందో ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆమె అన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ప్రకటనలు చేసే వ్యక్తిగా అభివర్ణించారు ప్రియాంక గాంధీ. ఆయన సీఎంగా ఉన్న 18 ఏళ్ల కాలంలో 22 వేలు వాగ్దానాలు చేశారని.. అందులో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు.
నర్మదా నదికి పూజలు చేస్తున్న ప్రియాంక, కమల్‌నాథ్
పార్టీ ఎన్నికల ర్యాలీ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, రాష్ట్ర నేతలు స్వాగతం పలికారు. అనంతరం కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్‌తో కలిసి ప్రియాంక గాంధీ నర్మదా నదికి ప్రత్యేక పూజలు చేశారు. నర్మదా నదికి హారతిని సైతం ఇచ్చారు.
పూజల్లో పాల్గొన్న ప్రియాంక గాంధీ
హారతి ఇస్తున్న ప్రియాంక గాంధీ
ప్రియాంకకు జ్ఞాపికను అందిస్తున్న కమల్‌నాథ్