ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (up polls 2022) కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (priyanka gandhi up election) పోటీ చేస్తారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమె.. రాష్ట్ర ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు కూడా. ఇదే జరిగితే గాంధీ కుటుంబ సభ్యుల్లో అసెంబ్లీకి పోటీపడిన తొలి వ్యక్తి ఆమే అవుతారు. జవహర్‌లాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు ప్రతి తరం సభ్యులు ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేశారు.
ప్రియాంక ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కుటుంబాన్ని ఎంతో కాలంగా ఆదరిస్తున్న అమేఠీ లేదంటే రాయ్‌బరేలి అసెంబ్లీ స్థానాలను ఎంచుకోవచ్చని అంటున్నారు. ఇటీవల కాలంలో ఈ రెండు చోట్ల చురుగ్గా తిరుగుతుండడం వల్ల ఆ అభిప్రాయం బలపడింది.
అక్కడైతే తీవ్ర పోటీ!
అమేఠీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన రాహుల్ గాంధీని భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ ఓడించారు. ప్రియాంక అక్కడే పోటీ చేస్తే భాజపా నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కోవలసి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అందువల్ల ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె రంగంలో ఉంటే కాంగ్రెస్ విజయావకాశాలు మెరుగుపడుతాయని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు.
వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు(UP Assembly Elections) జరగనున్నాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో 403 శాసనసభ నియోజకవర్గాలుండగా.. భాజపా 312 చోట్ల జయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ 47, బహుజన్‌సమాజ్ పార్టీ 19 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్‌కు కేవలం 7 సీట్లు మాత్రమే దక్కాయి.